Telugu Gateway
Telugugateway Exclusives

రచనా టెలివిజన్ పై కేసు పెట్టిన దీప్తి భట్నాగర్

రచనా టెలివిజన్ పై కేసు పెట్టిన దీప్తి భట్నాగర్
X

ఒప్పందం ముగిసిన తర్వాత కూడా 'యాత్రా' షోల వాడకం

1.5 కోట్ల రూపాయల నష్టానికి కారణం అయ్యారంటూ కేసు

ముంబయ్ లో ఎఫ్ఐఆర్ నమోదు

పొద్దున లేస్తే మనం చాలా మందికి నీతులు చెబుతాం. కానీ మన దగ్గరకొచ్చే సరికి మాత్రం అవి వర్తించవు. నీతులు పక్క వాడికి చెప్పటానికే అన్నట్లు వ్యవహరిస్తాం.. ఇది కూడా అంతే. రచనా టెలివిజన్ యాజమాన్యంపై కేసు చూస్తే ఎవరికైనా ఇదే భావన కలగటం సహజం. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పై ప్రముఖ బాలీవుడ్ నటి దీప్తి భట్నాగర్ ఇటీవలే కేసు పెట్టింది. ముంబయ్ లోని ఆర్ధిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలుగులో భక్తి, ఎన్టీవీ, వనితా టీవీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దీప్తి భట్నాగర్ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా 'యాత్ర' పేరుతో షోలు చేసింది. తొలుత ఈ షో హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంది. కానీ 2014లో రచనా టెలివిజన్ ఆధ్వర్యంలోని తెలుగు భక్తి ఛానల్ లో ఈ షో ప్రసారం అయింది. అయితే స్టార్ ఇండియా ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని చెప్పటంతో వ్యవహారం సెటిల్ చేసుకున్నట్లు దీప్తి భట్నాగర్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.

ఆ తర్వాత 2015 మార్చిలో రచనా టెలివిజన్, టీవీ దీప్తి భట్నాగర్ తో లైసెన్స్ ఒప్పందం చేసుకుంది. 81వ ఎపిసోడ్ నుంచి 145 వ ఎపిసోడ్ వరకూ డబ్బింగ్ హక్కులతో ప్రసారం చేసుకునేందుకే రెండేళ్ల పాటు అమల్లో ఉండేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం 2017లో ముగిసింది. లైసెన్స్ ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కూడా లైసెన్స్ డ్ ఎపిసోడ్ల మాస్టర్ కాపీలను అక్రమంగా తన దగ్గరే ఉంచుకుందని ఆమె తెలిపారు. అక్రమంగా మాస్టర్ కాపీలను ఉంచుకోవటమే కాకుండా తమ టెలివిజన్ ఛానళ్ళు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో ప్రసారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. లైసెన్స్ ఫీజు చెల్లించకుండా, కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించి ఈ చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

నమ్మకంతో తాను మాస్టర్ కాపీలను అప్పగిస్తే అనుచిత ప్రయోజనం పొందేలా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తన షోలను ప్రసారం చేస్తూ ఆర్ధికంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత మాస్టర్ కాపీలు అందించాల్సిందిగా కోరినా కూడా రచనా టెలివిజన్ యాజమాన్యం ఆ పని చేయలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి చట్టబద్దమైన హక్కు, ఒప్పందం లేకుండా రచనా టీవీ డైరక్టర్లు, ప్రమోటర్లు, ఉద్యోగులు తన షోలను ఓటీటీ కంటెంట్ ఫ్లాట్ ఫామ్ అయిన యప్ టీవీలో టెలికాస్ట్ కు అనుమతి ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీని వల్ల తనకు 1.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కాపీ రైట్ చట్టం, 1957లోని 1860 రెడ్ విత్ 51, 63, ఐపీసీలోని 409, 120 బీ ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు ఉండటంతో ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ తెలుగుగేవ్.కామ్ చేతిలో ఉంది.

Next Story
Share it