Telugu Gateway
Telugugateway Exclusives

జగన్ సెకండ్ ఛాన్స్ కోసం..ఢిల్లీ డైరెక్షన్..ఏపీ బీజేపీ యాక్షన్ !

జగన్ సెకండ్ ఛాన్స్ కోసం..ఢిల్లీ డైరెక్షన్..ఏపీ బీజేపీ యాక్షన్ !
X

ఢిల్లీ డైరెక్షన్. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ యాక్షన్. ఒక్క ఛాన్స్ అని తొలి సారి వైసీపీ అధినేత జగన్ విజయం సాధించారు. ఇప్పుడు జగన్ రెండవ ఛాన్స్ కోసం బీజేపీ రంగంలోకి దిగిందా..అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది విజయం కోసమే అవుతుంది. పొత్తు అంతిమ లక్ష్యం అదే కాబట్టి. కొన్నిసార్లు ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి కూడా ఈ పొత్తుల ఎత్తులు వేస్తారు. పొత్తుల విషయంలో తెర వెనక కూడా చాలా విషయాలు జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే ఏపీలో బీజేపీ మరో సారి అధికార వైసీపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత బలోపేతం చేసేవిగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మా ఢిల్లీ నాయకత్వం టీడీపీ తో కలిసే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసిందని గురువారం నాడు అయన మీడియా కు చెప్పారు. ఎవరితో కలవాలి...ఎవరితో కలవకూడదు అని నిర్ణయించు కునేది ఖచ్ఛితంగా బీజేపీనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ నిర్ణయాన్ని లోత్తుగా విశ్లేషిస్తే అసలు ఎజెండా బయటకు వస్తుంది. ఎలా అంటే గత ఎన్నికల్లో జనసేన కు దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అదే బీజేపీ విషయానికి వస్తే ఆ లెక్కలు పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ మూడున్నర ఏళ్లలో అధికార వైసీపీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ రెండు పార్టీలు కాసేపు ఓటు బ్యాంకు పెంచుకున్నాయి అనుకుందాం.

ఇది పది శాతానికి చేరింది అనుకున్నా ఈ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికల్లో కేవలం జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ఈ పది శాతంతో ఒక్క సీట్ కూడా రాదు. గత ఎన్నికల్లో ఎంత దెబ్బ తిన్నా టీడీపీ ఓటు బ్యాంకు 40 శాతం వరకు ఉంది. కారణాలు ఏమి అయినా బీజేపీ, జనసేన తో కలవటానికి టీడీపీ సిద్ధంగా ఉంది. అంటే 40 శాతం ఓట్లు ఉన్న టీడీపీ, బీజేపీతో కలుస్తాను అని చెపుతున్నా బీజేపీ నో చెపుతోంది అంటే దీని వెనక అసలు ఎజెండా వేరు ఉంది అన్న చర్చ ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. టీడీపీ కొత్తగా ఇప్పుడే ఫామిలీ పార్టీగా మారిందా. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అది ఫ్యామిలీ పార్టీ కాదా అన్న ప్రశ్నలు తలెత్తటం సహజం.. అయితే సోము వీర్రాజు పొత్తుల కామెంట్స్ పై జనసేన అధినేత ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. ఢిల్లీ పెద్దలు అంటే ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలోనే మోడీ ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఇచ్చారా. మరి మోడీ చెప్పిన ప్రకారమే పవన్ వెళ్తారా లేక సొంత నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పుడు ఇక బంతి పవన్ కోర్టులోనే ఉంది. ఏపీలో ఓట్లు లేని..సీట్లు రాని బీజేపీతో వెళ్లాలా ..లేక టీడీపీ తో పొత్తుపెట్టుకొని కొన్ని సీట్లు అయినా దక్కించుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. సోము వీర్రాజు చెప్పినట్లు టీడీపీ ని దూరం పెట్టి ఆ రెండు పార్టీలే కలిసి పోటీ చేస్తే అది ఖచ్ఛితంగా వైసీపీ గెలుపుకు బాటలు వేయటానికి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ ఎప్పటినుంచే ఇదే ప్రచారం చేస్తోంది కూడా.. పవన్ కళ్యాణ్ కూడా తమ పక్కకు రాకుండా వైసీపీ గెలుపునకు బీజేపీ సహకరించే పనిలో ఉంది అని. ఇప్పడు బీజేపీ చర్యలు ఆ దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి.



Next Story
Share it