Telugu Gateway
Telugugateway Exclusives

వాటర్ బాటిల్ ధరను 600 రూపాయలకు పెంచాలా?

వాటర్ బాటిల్ ధరను 600 రూపాయలకు పెంచాలా?
X

కృష్ణ ఎల్లా ఇప్పుడు ఇదే డిమాండ్ చేస్తారేమో!

వ్యాక్సిన్ వ్యాపారం మొదలు

నియంత్రణా సంస్థ పెట్టి కేంద్రం వ్యాక్సిన్ ధరలను నిర్ధారించలేదా?

భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా గత ఏడాది పలు సందర్భాల్లో తమ వ్యాక్సిన్ ధర మంచినీళ్ళ బాటిల్ కంటే తక్కువే ఉంటుందని పదే పదే ప్రకటించారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి..ముఖ్యంగా భారత్ కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ధరను మాత్రం ఏకంగా 600 రూపాయలకు అని ప్రకటించారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే. అదే ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే 1200 రూపాయలు అంట. మరి కృష్ణ ఎల్లా లెక్కలు మ్యాచ్ అవ్వాలంటే మంచి నీటి బాటిల్ ధరను ఆరు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తారేమో. ఓ వైపు కేంద్రానికి మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ లను మాత్రం డోసు 150 రూపాయలకే మాత్రం సరఫరా చేస్తున్నారు.

కానీ రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం రేట్లలో తేడా చూపిస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సీరమ్ కు 3000 కోట్ల రూపాయలు, భారత్ బయోటెక్ కు 1500 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కనీసం భారత్ బయోటెక్ అయినా ఐసీఎంఆర్ తో కలసి సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి తయారు చేస్తోంది. అదే సీరమ్ కేవలం ఉత్పత్తి దారు మాత్రమే. మంచినీటి బాటిల్ ధరకే వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన కృష్ణ ఎల్లా ఇప్పుడు ధరలను ఇంత భారీగా పెంచటాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా సీరమ్ ఇన్ స్టిట్యూట్ , భారత్ బయోటెక్ లు ధరలను ఇంత భారీగా ప్రకటించాయంటే నమ్మటం కష్టమే అని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరో విచిత్రం ఏమిటంటే కోవిషీల్డ్ కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా ఎక్కువ ధరకు వ్యాక్సిన్ విక్రయిస్తోంది. భారత్ లో ప్రైవేట్ కు 600 రూపాయలకు విక్రయిస్తుంటే.. అదే సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికాలో మాత్రం 393 రూసాయలకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ విక్రయిస్తున్నారు.

అదే అమెరికాలో అయితే ఇది కేవలం 300 రూపాయలు మాత్రమే. ఇలా పలు దేశాల్లో తక్కువ ధరకు విక్రయిస్తూ భారత్ లోనే వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఇంత భారీ ధరలు పెట్టడం విచిత్రం. జనాభా పరంగా కూడా అతి పెద్ద దేశం అయిన భారత్ లో ఇంత అధిక ధరలు అంటే వ్యాక్సిన్ కంపెనీలు మంచి లాభాలు చూసుకోవటం కంటే..కరోనా సాకూతో దోచుకోవటానికే ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అన్నింటికి నియంత్రణా సంస్థలు పెట్టి రేట్లను నిర్ధారిస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే కరోనా వ్యాక్సిన్ విషయంలో రేట్లను నిర్ధారించే వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాలను కంపెనీలకు వదిలేయటంలోనే అసలు మతలబ ఉందని చెబుతున్నారు.

Next Story
Share it