Telugu Gateway
Telugugateway Exclusives

టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనా?!

టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనా?!
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్, బిజెపిలు ఆ స్పీడ్ ను మరింత పెంచనున్నాయి. ఇతర ఉప ఎన్నికల ఫలితాలకు..ఈ ఉప ఎన్నికకు చాలా తేడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళ సమయం ఉన్న తరుణంలో వచ్చిన ఈ ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీని భారీ దెబ్బతీసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ కు ఇది వార్నింగ్ సిగ్నల్. ముఖ్యంగా నిరుద్యోగ యువతతోపాటు పలు వర్గాల్లో టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా సీఎం కెసీఆర్ చెప్పేది ఒకటి..చేసేది మరొకటి అన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడుతోంది. ఇది కూడా టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరగటానికి కారణం అవుతోంది. నాగార్జునసాగర్ లో సీనియర్ నేత జానారెడ్డిని టీఆర్ఎస్ ఓడించి ఉండొచ్చు. కానీ మాజీ మంత్రి, ఇటీవ‌ల వ‌ర‌కూ టీఆర్ఎస్ లో కీల‌క నేత‌గా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసి వెళితే వచ్చిన ఉప ఎన్నిక ఫలితం మాత్రం అలాంటిది కాదు. ఇతర పార్టీల నేతలపై గెలుపు వేరు..పార్టీ పెట్టినప్పటి నుంచి కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ బయటికి వెళ్లి మరీ సాధించిన గెలుపు వేరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఈటెల వాదనకే మద్దతు పలికినట్లు అయింది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ను బానిస భవన్ అంటూ వ్యాఖ్యానించారు. కెసీఆర్ దగ్గర మంత్రులతోపాటు...ఎమ్మెల్యేలకూ ఎవరికి విలువ ఉండదని..అంతా నియంతృత్వం అని ఆరోపించారు. తనతోపాటు మంత్రి హరీష్ రావు కూడా ఎన్నోసార్లు అవమానాలు జరిగాయని వ్యాఖ్యానించారు. అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో అసలు దళిత, గిరిజనులకు చోటు ఉందా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఈటెల ఈ అంశం లేవనెత్తిన కొద్ది రోజులకే దళిత అధికారులకు పలు కీలక పోస్టులు ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కెసీఆర్ నియంతృత్వానికి, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి మధ్యే అని ఈటెల రాజేందర్ పదే ప దే ప్రస్తావించారు.

ఆత్మగౌరవం ఉన్న ప్రజలు ఖచ్చితంగా తనవైపు నిలబడతారని..కెసీఆర్ ఆటలు సాగనివ్వబోరని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లే జరిగింది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికి దళితబంధు కింద పైలట్ ప్రాజెక్టు పేరుతో ఏకంగా 2000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఇదొక్కటే కాదు...రాష్ట్రంలో పలు చోట్ల ఆగిపోయిన స్కీమ్ లు కూడా ఒక్క హుజూరాబాద్ లో మాత్రం పరుగులు పెట్టాయి. అందుకే ఇక్కడ అమలు చేసే కార్యక్రమాలు తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులుగా ఉన్న వారు ఎందుకు అమలు చేయటంలేదో ప్రశ్నించాలని ఈటెల తన ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. అయితే ఎన్నికలకు ముందు సీఎం కెసీఆర్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ సర్వేలు అన్నీ టీఆర్ ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని, టీఆర్ఎస్ కు, బిజెపికి మధ్య గ్యాప్ చాలా ఉందని ప్రకటించారు. ఈటెల రాజేందర్ ఏమైనా జానారెడ్డి కంటే గొప్ప వ్యక్తా? నాగార్జున సాగర్ లో కొత్త కుర్రాడితో జానారెడ్డి లాంటి వ్యక్తిని కూడా ఓడించాం. అలాంటి సంచలన గెలుపుల చరిత్ర టీఆర్ఎస్ కు చాలా ఉందని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. కానీ ఫలితం మాత్రం కెసీఆర్, కెటీఆర్ అంచనాలకు భిన్నంగా వచ్చింది. అంతే కాదు..సీఎం కెసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చి దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టగా..కెటీఆర్ మాత్రం సేఫ్ గేమ్ లో భాగంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్న అంశం అని..దీన్ని తాము పెద్దగా పట్టించుకోమంటూ కవరింగ్ వ్యాఖ్యలు చేశారు. కానీ టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కెసీఆర్ ఎంత సీరియస్ గా ఈ ఎన్నికను పట్టించుకుందో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఒక్క నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయల నిదులు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సాగిన ఓట్ల కొనుగోళ్ళు, ఇతర పార్టీల నేతల చేరికలు, కుల సంఘాల నేతల మద్దతు ప్రకటనలు..నెలల తరబడిన సాగిన విందులు..వినోదాలు..ఇవేమీ కూడా అధికార పార్టీ అభ్యర్ధిని బయటపడేయలేకపోయాయి. అంటే టీఆర్ఎస్ కు తేడా గట్టిగానే కొడుతోంది.

Next Story
Share it