కెసీఆర్ కు కరోనా మాట ఇచ్చి మోసం చేసిందా?.
ముఖ్యమంత్రి మాటలకు చాలా విలువ ఉంటుంది. ఆయన చెప్పారంటే ఆ మాట కోట్ల మందికి చేరుతుంది. అంతే ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కెసీఆర్ మరోసారి కరోనాపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి చిన్న పిల్లలనే పడతా అని వీళ్లకు ఫోన్ చేసి చెప్పిందా? అంటూ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి, రెండు దశల్లో ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కరోనా విషయంలో కెసీఆర్ చెప్పినట్లు ప్రజలను భయపెట్టిన మాట నిజమే. కానీ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణకు కరోనా రాదని..రానివ్వబోమని ప్రకటించారు. అంటే అప్పుడు తెలంగాణకు రానని సీఎంకు కరోనా చెప్పినట్లా?. లేక చెప్పి కూడా మోసం చేసిందా? అంతే కాదు వస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఎదుర్కొంటామని చెప్పారు. కరోనా వస్తే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్క్ లు లేకుండా నిలబడి పనిచేస్తామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళికిపోతే మాస్క్ తీయమంటున్నారని..అది చివరకు తనకు కూడా వచ్చిందని అన్నారు. ఎప్పటిలాగానే కెసీఆర్ మరోసారి పారాసిటమాల్ మరో గోళీతోనే కరోనా తగ్గిపోతుందని తెలిపారు.. కెసీఆర్ చెప్పిందే నిజం అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు అన్నీ కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయల వసూలు చేసిన ఫీజులు దోపిడీని ప్రభుత్వమే అనుమతించినట్లుకదా?.
ఇంత తక్కువ గోళీలతో తగ్గే కరోనాకు అంత ఫీజులు వసూలు చేయటాన్ని సీఎం కెసీఆర్ ఇప్పుడు ఎలా జస్టిఫై చేస్తారు. దేశంలో ఇప్పటికే పెద్ద వాళ్లకు కొంత మేర వ్యాక్సినేషన్ పూర్తవుతున్నందున థర్డ్ వేవ్ అంటూ వస్తే అది కాస్త పిల్లల్లో ఎక్కువ కేసులు నమోదు కావచ్చని కొంత మంది నిపుణులే అంచనా వేశారు. తర్వాత మరికొంత మంది దీనికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవని..వ్యాక్సినేషన్ ఆధారంగానే ఈ అంచనా అంటూ తేల్చారు. కరోనా విషయానికి సంబంధించి రాష్ట్రంలో టెస్ట్ ల దగ్గర నుంచి ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణ వరకూ హైకోర్టు చెప్పిన తర్వాతే ప్రభుత్వం కదిలిన సందర్భాలు ఎన్నో. అంతే కాదు..అసలు లాక్ డౌన్ వల్ల ఏమీ ఉపయోగం లేదని..దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గటం లేదని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని మరీ అధికారికంగా ప్రకటించారు. అసలు తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ప్రశ్నేలేదన్నారు. కానీ ఆ తర్వాత వెంటనే లాక్డౌన్ పెట్టి దీని వల్లే సత్ఫలితాలు వచ్చాయన్నారు. ఓ ముఖ్యమంత్రి ఇంతటి కీలక విషయాల్లో ఇలా తరచూ మాట మార్చటం వల్ల ప్రజలు మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కరోనా వేరియంట్ల తరహాలో సీఎం కెసీఆర్ కూడా రకరకాలుగా మాటలు మారుస్తున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.