కాంట్రాక్టర్లకు సర్కారు కంటే బ్యాంకులపైనే నమ్మకమా?
కృష్ణబాబు మాటలు చెప్పేదేమిటి?
బ్యాంకులు అప్పిస్తేనే ఏపీలో రోడ్లు బాగు
ప్రభుత్వంలో ఏ పనులకు అయినా టెండర్లు పిలిచి..చేసిన పనుల ప్రకారం బిల్లులు చెల్లించుకుంటూపోతారు. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి. కానీ ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. చేసిన పనులకు బిల్లులు రావేమో అన్న భయంతో ముఖ్యంగా ఆర్అండ్ బి కాంట్రాక్టర్లు పనులు చేయటానికి ముందుకు రావటంలేదు. దీంతో రాష్ట్రంలోని రహదారులు దారుణాతి దారుణంగామారిపోయాయి. ఈ అంశంపై సోమవారం నాడుమీడియాతో మాట్లాడిన ఆర్అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లలో ఉత్సాహం నింపేందుకు బ్యాంకుల నుంచే నేరుగా వారికి బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ కూడా ఆదేశించారన్నారు. అంటే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకం పోయిందని ఆయన మాటల్లోనే తేలిపోయింది. అంటే కాంట్రాక్టర్లు ప్రభుత్వం కంటే బ్యాంకులనే నమ్ముతున్నట్లు కన్పిస్తోంది. నిజంగా ఇది ప్రభుత్వానికి చాలా అవమానకరమైన పరిస్థితి అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. సహజంగా కాంట్రాక్టర్లు పనులు చేయటానికి ఎప్పుడైనా ఎంతో ఉత్సాహం చూపుతారని..అలాంటిది ఇప్పుడు ఆర్ అండ్ బి లాంటి శాఖల్లో టెండర్లు పిలిచినా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదంటే పరిస్థితి దారుణం అన్నారు.
అంటే కొత్తగా చేపట్టదలచిన 8970 కిలమీటర్ల పనులకు టెండర్లు పిలిచినా అందులో కూడా బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తామని అంశాన్ని కూడా ప్రస్తావించాల్సి రావొచ్చని..ఇది ప్రభుత్వానికి అవమానమే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ తరహా పరిస్థితి రావటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. నిజానికి కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులను ప్రభుత్వం తన అవసరాల కోసం అటూ ఇటూ సర్దుబాటు చేసుకోవటం సహజమే. కానీ ఇప్పుడు చేసిన పనికి అనుగుణంగా బిల్లులు చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం ఉంటే తప్ప కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి మాత్రం అసహజం..అవమానకరమని ఓ సీనియర్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు. అంటే బ్యాంకు మంజూరు చేసే రుణం ఈ బిల్లుల చెల్లింపు తప్పదేనికి వాడకూదు. అప్పుడే మాత్రం కాంట్రాక్టర్లు కూడా ముందుకు వస్తారని ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. అదే కాదు...కృష్ణబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణం మంజూరు చేస్తే తప్ప టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టే పరిస్థితి లేదు. దీంతో ఇంకా చాలా రోజులు ఏపీ ప్రజలకు రోడ్ల కష్టాలు తప్పేలా లేవు.