Telugu Gateway
Telugugateway Exclusives

'రాజ‌కీయ అప‌రిచితుడు' కెసీఆర్!

రాజ‌కీయ అప‌రిచితుడు కెసీఆర్!
X

హీరో విక్ర‌మ్ అప‌రిచితుడు సినిమాలో రెండు వేరియ‌ష‌న్స్ అద్భుతంగా చూపిస్తాడు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీకి సంబంధించి టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ చూపిస్తున్న వేరియేష‌న్స్ చూసి రాజ‌కీయ పండితులు సైతం అవాక్కు అవుతున్నారు. అంతే కాదు..ఆ వేరియేష‌న్స్ ఏకంగా ద‌శావ‌తారం సినిమాలో క‌మ‌ల‌హాస‌న్ రేంజ్ కు చేరాయ‌ని ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. జాతీయ రాజ‌కీయాల‌పై కెసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఎవ‌రికైనా ఇది నిజమే క‌దా అని అన్పించ‌క‌మాన‌దు. ఓ సారి ఢిల్లీలో అగ్గిరాజేస్తాం..ఢిల్లీ నేత‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తాం అని ప్ర‌క‌టిస్తారు. త‌ర్వాత అగ్గి రాజేయ‌టం ఉండ‌దు..గ‌డ‌గ‌డ‌లాడించ‌ట‌మూ ఉండ‌దు. కొద్ది రోజుల క్రితం భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అంటూ హంగామా చేశారు. మా వాళ్లు అంతా కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చ‌మంటుటున్నారు అంటూ ప్ర‌క‌టించారు. త‌ర్వాత చూస్తే ఈ బీఆర్ఎస్ బీరువాలోకి వెళ్లిన‌ట్లే క‌న్పిస్తోంది. ఓ సారి దేశ‌మంత‌టా అన్ని పార్టీల నాయ‌కుల‌ను క‌లుస్తా..నాయ‌కుల‌ను ఏకంగా చేస్తా అని ప్ర‌క‌టించారు. త‌ర్వాత కూల్ గా ఇదేదో నాలుగు పార్టీలు..నలుగురు నాయ‌కుల గుంపు కాదు..కావాల్సింది గుణాత్మ‌కమార్పు రావాలి..ఈ దిశ‌గానే నా ప్ర‌య‌త్నం అంటూ ప్ర‌క‌టించారు. అస‌లు ఆ గుణాత్మ‌క‌మార్పు అనే ప‌దార్ధం ఏమిటో ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు రొటీన్ ప్ర‌భుత్వాలు వ‌ద్దు అంటున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటు ఎప్పుడూ రొటీన్ గానే ఉంటుంది...రాష్ట్రంలో అయినా..కేంద్రంలో అయినా మార్పు చూపించాల్సింది పాలిస్తున్న నాయ‌కుల‌నే. తొలుత దేశాన్ని పాలించ‌టంలో బిజెపి, కాంగ్రెస్ లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ విష‌యంలో అప్ప‌టి దూకుడు ను త‌గ్గించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా బిజెపి ముక్త్ భార‌త్ నినాదాన్ని అందుకున్నారు.

ఓ రాష్ట్రానికి ప‌రిమితం అయిన టీఆర్ఎస్ కు అస‌లు ఇది సాధ్యం అయ్యే ప‌నేనా?. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయాల‌ని పిలుపునిచ్చిన కెసీఆర్ కు పెద్ద ఎదురుదెబ్బే త‌గిలిన విష‌యం తెలిసిందే. బీహార్ లోని నితిష్ తోపాటు మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీ, శివ‌సేన‌, త‌మిళ‌నాడులో డీఎంకె వంటి కీలక పార్టీలు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ తో క‌ల‌సి సాగుతున్నాయి. అస‌లు కెసీఆర్ కు త‌న‌తో ఎవ‌రు వ‌స్తారో తెలియ‌దు..బిజెపి ముక్త భార‌త్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే నాయ‌కుడు ఎవ‌రో తెలియ‌దు. కానీ కెసీఆర్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నినాదాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో రాబోయేది రైతు ప్ర‌భుత్వం అంటూ విచిత్ర ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. తెలంగాణాలో ఉన్న‌ది రైతు ప్ర‌భుత్వ‌మే క‌దా..మ‌రి ఇక్క‌డి రైతులు ఇంకా ఎందుకు స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారు అన్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ఉండ‌దు. ఇదే కెసీఆర్ త‌న తొలి ట‌ర్మ్ లో ప్ర‌ధాని మోడీ నే ఇప్ప‌టి వ‌ర‌కూ దేశం చూసిన అత్యుత్త‌మ ప్ర‌ధాని అంటూ కితాబిలిచ్చారు. అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నార‌ని అప్పట్లో ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ చేసి కేంద్రంలో ఉన్న‌ది అత్యంత అవినీతి ప్ర‌భుత్వం అని,మోడీని త‌రిమికొడితేనే దేశం బాగుప‌డుతుంద‌ని ప్ర‌క‌టిస్తారు. సీఎం కెసీఆర్ లో ఇన్నివేరియేష‌న్లు చూస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it