Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్...కాళేశ్వ‌రం క‌ట్టిన‌ప్పుడు ఇంజనీర్..వ‌ర‌ద‌లు వ‌స్తే వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌!

కెసీఆర్...కాళేశ్వ‌రం క‌ట్టిన‌ప్పుడు ఇంజనీర్..వ‌ర‌ద‌లు వ‌స్తే వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌!
X

కాళేశ్వ‌రం క‌ట్టిన‌ప్పుడు సీఎం కెసీఆర్ ఓ ఇంజ‌నీర్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తానే చేసిన‌ట్లు చెప్పుకున్నారు చాలా సార్లు. భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రానికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు సీఎం కెసీఆర్ ఓ వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌గా మారిపోయారా?. ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లో ఇదే చ‌ర్చ‌. క్లౌడ్ బ‌ర‌స్ట్ ఓ విదేశీ కుట్ర‌..ఇంకా నిర్ధార‌ణ కాలేదు అని చెప్పారు. మ‌రి నిర్ధార‌ణ కాన‌ప్పుడు బాధ్య‌తాయుత‌మైన ఓ ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి అంత తేలిగ్గా ఇంత‌టి కీల‌క వ్యాఖ్య‌లు బ‌హిరంగంగా ఎలా చేసిన‌ట్లు?. సీఎం చెప్పారంటే వాటిని న‌మ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇంకా నిర్ధార‌ణ కాలేద‌ని అంటూనే ఓ సారి లేహ్ లో...ఉత్త‌రాఖండ్ లో ఇలా చేశార‌ని..ఇప్పుడు గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో చేస్తున్నార‌నే అనుమానాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు.

దీని వెన‌క విదేశీయులు ఉన్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేశారు. అస‌లు క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటే నిర్దేశిత ప్రాంతంలో అసాధార‌ణ స్థాయిలో భారీ వ‌ర్షం కురిసి పోవ‌టం. దీని వ‌ల్ల పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు కూడా వ‌స్తాయి. కానీ తాజా వ‌రద‌ల‌కు గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలే కార‌ణం. కానీ సీఎం కెసీఆర్ ఇప్పుడు ఏకంగా క్లౌడ్ బ‌ర‌స్ట్..విదేశీ కుట్ర‌ల‌ను తెర‌పైకి తేవ‌టం వెన‌క కార‌ణం ఏమై ఉంట‌ది అన్న చ‌ర్చ సాగుతోంది. ఓ వైపు కాళేశ్వ‌రం మోటార్లు మునిగి కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింద‌నే వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో కెసీఆర్ కుట్ర వ్యాఖ్య‌లు చేయ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. టీవీల్లో సీఎం కెసీఆర్ వ్యాఖ్య‌లు చూసిన ప్ర‌తి ఒక్క‌రూ కాసేపు అవాక్కు అయ్యార‌ని చెప్పొచ్చు.

Next Story
Share it