Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ క‌ల‌లు మారుతున్నాయ్!

కెసీఆర్ క‌ల‌లు మారుతున్నాయ్!
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) అధినేత‌, సీఎం కెసీఆర్ క‌ల‌లు మారుతున్నాయ్. ఆయ‌న తొలి క‌ల‌..తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. అందులో ఆయ‌న పాత్ర అత్యంత కీలకం అయినా..అంద‌రూ ఆయ‌న వైపు తిరిగేలా చేయ‌గ‌లిగారు..చేసుకున్నారు..వాడుకున్నారు.. విజ‌యం సాధించారు. సాధించిన రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. రాష్ట్రం వ‌స్తే చాలు త‌న‌కు అస‌లు ప‌దవులేమీ అక్క‌ర్లేదు అని అప్ప‌ట్లో చాలా చెప్పారు. తొలుత రాష్ట్ర పున‌ర్ నిర్మాణం అన్నారు...త‌ర్వాత బంగారు తెలంగాణ అన్నారు. అంతే కాదు..అటుకులు బుక్కి..క‌డుపుక‌ట్టుకుని ప‌ని చేసిన టీఆర్ఎస్ పార్టీకి మాత్రం వంద‌ల కోట్ల రూపాయ‌ల నిధులు వ‌చ్చిప‌డ్డాయి. ఇంత నిజాయ‌తీగా ప‌నిచేసినా స‌రే అనుకోగానే 80 కోట్ల రూపాయ‌లు పైగా వెచ్చించి విమానం కొనుక్కొనే..ఆ స్థాయిలో విరాళాలు ఇచ్చే నేత‌లు కూడా టీఆర్ఎస్ లో పుట్టుకొచ్చారు. తొలి క‌ల సాకారం అయింది..మ‌రి ఇప్పుడు కెసీఆర్ త‌న రెండ‌వ కల కోసం ద‌స‌రా నాడు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అయితే ఈ సారి కంటున్న రెండ‌వ క‌ల చాలా పెద్ద‌ది. మ‌రి ఇందులో ఆయ‌న ఏ మేర‌కు విజ‌యం సాధిస్తారో వేచిచూడాల్సిందే. అందులో భాగంగానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఎస్ఆస్ గా రూపాంతరం చెంద‌బోతుంది. ఎమ్మెల్యే అయిన ప్ర‌తి ఒక్క‌రూ మంత్రి అవ్వాల‌ని కోరుకుంటారు..మంత్రి అయినా వాళ్లు ఛాన్స్ వ‌స్తే ముఖ్య‌మంత్రి కావాల‌ని కూడా ఆశిస్తారు. కానీ ఛాన్స్ లు అంద‌రికీ రావు. ప‌రిస్థితుల‌ను వాడుకుని..తీసుకోవ‌టంలోనే వారి వారి స‌క్సెస్ ఉంటుంది. తెలంగాణ విష‌యంలో కెసీఆర్ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. కానీ జాతీయ స్థాయిలో ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే. స్వ‌యంగా సీఎం కెసీఆరే కాంగ్రెస్, బిజెపిల‌కు పాలించ‌టం చేత కావ‌టంలేదు..దేశంలో అపార వ‌న‌రులు ఉన్నా వాడుకోవ‌టం రావటం లేదు..అందుకే ఇంత వెన‌క‌బ‌డి ఉన్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు.

ప్ర‌త్యామ్నాయ విధానంతో దేశానికి దారి చూపిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేత‌లు అయితే కెసీఆర్ ప్ర‌ధాని అయితే త‌ప్పేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ తాను ఏమి చేసినా దేశానికి ఆద‌ర్శ‌మే అని చెబుతారు. ఉదాహ‌ర‌ణ‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్. కానీ దేశానికి ఆద‌ర్శం అని చెప్పే ధ‌ర‌ణి పోర్ట‌ల్ లో మాత్రం తెలంగాణ‌లో ఎవరి భూములు వారికి కాకుండా పోతున్నాయి. ఇంత గంద‌ర‌గోళం ఎప్పుడూ భూ సొంత‌దారులు ఎదుర్కొని ఉండ‌రు. రైతుల‌కు ఏటా డ‌బ్బులిస్తూ..దానికి రైతు బందు అని పేరు పెట్టి ఇది కూడా దేశానికి ఆద‌ర్శం అంటారు. ద‌ళిత కుటుంబాల‌కు ప‌ది ల‌క్షల రూపాయ‌లు ఇస్తూ దేశానికి ఆద‌ర్శం అంటారు. ఆద‌ర్శం అనేది పాల‌న‌లో ఉండాలి కానీ..పంచ‌టం..పంచే స్కీమ్ ల‌కు ఓ పేరు పెట్టి దేశంలో ఎక్క‌డైనా ఇలాంటి ప‌థ‌కాలు ఉన్నాయా అంటే అది ఆద‌ర్శ పాల‌న అయిపోతుందా?. తొలి క‌ల విష‌యంలో విజ‌యం సాధించిన కెసీఆర్ ఇప్పుడు రెండ‌వ క‌ల విషయంలోనూ భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. చూడాలి ఏమి అవుతుందో..తెలంగాణ పారినంత తేలిగ్గా ఆయ‌న పాచిక‌లు ఇత‌ర రాష్ట్రాల్లో పార‌తాయా..చూడాల్సిందే.

Next Story
Share it