Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ ఢిల్లీ పర్యటన అసలు ఉద్దేశం అదే?!

కెసీఆర్ ఢిల్లీ పర్యటన అసలు ఉద్దేశం అదే?!
X

కొత్త సంవత్సరంలో సీఎం పీఠంపై కెటీఆర్!

నాకు సహకరించినట్లే కెటీఆర్ కూ మీ ఆశీస్సులు కావాలి!

మంత్రివర్గంలోకి కవిత

ముఖ్యమంత్రి కెసీఆర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన అసలు ఉద్దేశం ఏంటి?. ఇప్పటివరకూ బయటకు వచ్చిన వార్తల ప్రకారం చూస్తే అంత ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో చర్చించాల్సినంత అత్యవసర అంశాలు ఏమీ కన్పించవు. కానీ సీఎం కెసీఆర్ ఢిల్లీ వెళ్ళారు..వెనక్కి బయలుదేరారు. అయితే కెసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు టీఆర్ఎస్ కు చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటి అంటే కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి పీఠాన్ని తన తనయుడు, మంత్రి కెటీఆర్ కు అప్పగించబోతున్నారు సీఎం కెసీఆర్. అంతే కాదు మంత్రివర్గంలోకి కవిత కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే తాను దిగి కెటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పగించే తరుణంలోనే కవితను కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు చెబుతున్నారు. అప్పుడు 'లెక్క' సరిపోతుందని అంచనా.

ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలసిన సమయంలో కెసీఆర్ ప్రధానంగా తనకు సహకరించినట్లే తన తనయుడు కెటీఆర్ కు కూడా సహకరించాల్సిందిగా కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో సంఖ్యాపరంగా చూస్తే కెసీఆర్ కు ఉన్న బలానికి ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ అలాగే చేశారు. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయంగా వరసగా ఎదురుదెబ్బలు. ముందు దుబ్బాక. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు. భవిష్యత్ కూడా ఏమి అంత ఆశాజనంగా కన్పించటంలేదు. ప్రజల్లో టీఆర్ఎస్ సర్కారుపై పెరుగుతున్న అసమ్మతి. అందుకే దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతలుగా ఉన్న మోడీ, అమిత్ షాలను వ్యక్తిగతంగా కలసి మర్యాదపూర్వకంగా మాట చేరవేయటం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కెసీఆర్ ఈ పని చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎం పీఠంపై కెటీఆర్ ను కూర్చోపెట్టే ప్రక్రియ మరింత జాప్యం చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే కెసీఆర్ ఆగమేఘాల మీద పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాలం గడిచే కొద్దీ ప్రతికూలతలు పెరగటం తప్ప...సానుకూలంగా మారే అంశాలు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కెటీఆర్ కు సీఎం సీటు, కవితకు మంత్రి పదవి అంశంలో కూడా కెసీఆర్ పై ఒత్తిడి ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం బాధ్యతలు కెటీఆర్ కు అప్పగించి కెసీఆర్ పూర్తిగా రాజకీయ అంశాలపైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. మరో వైపు జమిలి ఎన్నికలకు చాన్స్ ఉందనే వార్తలు బలంగా విన్పిస్తున్న తరుణంలో కెసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికైతే కెటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి పెద్దగా ఎలాంటి అడ్డంకులు లేవు. జాప్యం అయ్యే కొద్దీ కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అందుకే తాజాగా సిద్ధిపేట పర్యటనలో కూడా కెసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో హరీష్ రావుపై ఆణిముత్యం అంటూ పొగడ్తలు కురిపించారు. కానీ ఇదే ఆణిముత్యాన్ని కొంత కాలం మంత్రి పదవికి దూరం పెట్టి..పార్టీలో పట్టు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయం అందరూ చూసిందే. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే సంతకాలు అందుతున్నాయి.

Next Story
Share it