Telugu Gateway
Telugugateway Exclusives

జ‌గ‌న్...' నేనూ...నా ల్యాప్ టాప్'

జ‌గ‌న్... నేనూ...నా ల్యాప్ టాప్
X

పారిశ్రామిక రాయితీల చెల్లింపుల‌కు జాకెట్ యాడ్సా?

ఈ త‌ర‌హా ప్ర‌చారం ఇదే తొలిసారి..ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారుల విస్మ‌యం

రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసిన వారికి రాయితీలు, ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌టం అత్యంత సాధారణ విష‌యం. యూనిట్ ఏర్పాటు స‌మ‌యంలో జ‌రిగిన ఒప్పందం..రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్ర‌కార‌మే ఈ చెల్లింపులు చేస్తారు. మెగా యూనిట్ల‌కు ప్ర‌త్యేక రాయితీలు ఉంటాయి. ఈ రాయితీలు, ప్రోత్సాహ‌కాలు ప‌రిశ్ర‌మ‌ల శాఖ త‌న‌కు కేటాయించిన బ‌డ్జెట్ ప్ర‌కారం చేసుకుంటూ వెళుతుంది.ఇది అధికారుల స్థాయిలోనే ఆటోమేటిక్ గా జ‌రిగిపోయే వ్య‌వ‌హారం. కానీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు దీని కోసం కోట్లాది రూపాయ‌ల వ్య‌యం చేస్తూ ప‌త్రిక‌ల ద్వారా జాకెట్ యాడ్స్ ఇచ్చి మ‌రీ ఇదేదో కొత్త స్కీమ్ అన్న‌ట్లు ప్ర‌చారం చేసుకుంటోంది. సీఎం ఈ రాయితీలు విడుద‌ల చేయ‌టం కూడా కొత్తే. మామూలుగా ఈ రాయితీల చెల్లింపుల వ్య‌వ‌హారం మూడో కంటికి తెలియ‌కుండా ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారుల స్థాయిలో అలా మామూలుగా సాగిపోతుంది. తాజాగా ఈ రాయితీల చెల్లింపులు సాగుతున్న తీరుపై ప‌రిశ్ర‌మ‌ల శాఖ వ‌ర్గాలు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌త కొంత‌ కాలంగా రాష్ట్రంలోని ప‌రిశ్ర‌మ‌లు త‌మ‌కు రావాల్సిన రాయితీలు, ప్రోత్సాహ‌కాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నాయి. వీటి అన్నింటిని ఆపి ఆపి...ఒక్క‌సారిగా 1124 కోట్ల రూపాయ‌ల‌ను శుక్ర‌వారం నాడు జ‌మ చేశారు. రాష్ట్రంలో స్కీమ్ ఏది అయినా...సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఏవి అయినా కూడా సీఎం జ‌గ‌న్...' నేనూ...నా ల్యాప్ టాప్' అన్న త‌ర‌హాలో సాగుతుంద‌ని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

రొటీన్ గా జ‌రిగే ప‌నుల‌కు కూడా ఇలా కోట్లాది రూపాయ‌లు ప్ర‌క‌ట‌న‌లు ద్వారా ఖ‌ర్చు చేయ‌టంపై అధికారులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రాయితీల విడుద‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ‌తంలో హడావిడి ఎక్కువగా ఉంటేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేసింది.. ఎయిర్‌బస్‌ వచ్చేసింది అని మరో రోజు, బుల్లెట్‌ రైలు వచ్చేసిందని మరో రోజు ఇలా హెడ్‌లైన్స్‌ పెట్టి రాసేవారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. కానీ జ‌గ‌న్ కూడా ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న యూనిట్ల‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇచ్చే రాయితీలు ఇస్తూ కూడా ఇంత భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్న విష‌యాన్ని మాత్రం విస్మ‌రించారు.

తాడేప‌ల్లిలో ప‌రిశ్ర‌మ‌ల రాయితీలు విడుద‌ల చేస్తూ జ‌గ‌న్ మీడియాపైనా..గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ''పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలన్నీ అమలు చేస్తున్నాం. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతపడతాయి. 25 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు' అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారని మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సీఎం తెలిపారు.'ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే.. రాష్ట్రం ప్రభుత్వం ఒక మాట చెప్తే.. చేస్తుంది అని నమ్మకం కల్పించడం అంటే.. పరిశ్రమలను పెట్టడానికి విశ్వాసం కల్పించడమే. మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవారుసహా వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుంది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా జీడీపీకి దోహదపడతాయి అని తెలిపారు.

Next Story
Share it