పదే పదే జగన్ ఎందుకిలా?!
![పదే పదే జగన్ ఎందుకిలా?! పదే పదే జగన్ ఎందుకిలా?!](https://telugugateway.com/h-upload/2022/04/04/1509498-cm-jagan2.webp)
ఇదీ వైసీపీ నేతల్లో సాగుతున్న చర్చ. పదే పదే జగన్ ఎందుకు ఇలా తప్పులు మాట్లాడుతున్నారు. అది కూడా తెలుగులో మాట్లాడుతూనే. జగన్ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్..జగన్ అప్ డేటెడ్ లీడర్ అంటూ ప్రచారం చేసుకునేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పలు సమావేశాల్లో ఆయన మాట్లాడిన మాటలు చూసి అప్ డేటెడ్ సంగతి అలా ఉంచి..జగన్ కు సరిగా తెలుగు మాట్లాడటం కూడా రాదు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. మధ్యలో కొన్ని రోజులు ఈ తప్పుల ట్రోలింగ్ ను తప్పించుకునేందుకు రికార్డెడ్ వీడియోలు విడుదల చేశారు కూడా. ఎప్పుడో ఒకసారి ఎవరైనా పొరపాటు చేస్తారు..తప్పు మాట్లాడతారు. అందులో విచిత్రం ఏమీలేదు. కానీ జగన్ విషయంలో మాత్రం అవే పొరపాట్లు తప్పులు..పదే పదే జరుగుతున్నాయి. ఇటీవలే వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవంలో గర్భం దాల్చిన అక్క, చెల్లెమ్మలు అనబోయి పలుమార్లు..గర్వం ..గర్వం అంటూ బుక్ అయ్యారు. సహజంగానే ఈ వీడియోను టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ట్రోల్ చేశాయి. సోమవారం నాడు కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ స్పీచ్ చూసిన వారికి ఆశ్చర్యం కలిగించాయనే చెప్పాలి.
జగన్ తన ప్రసంగంలో వివిధ అంశాలు ప్రస్తావిస్తూ 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది, 1979 జూన్ లో విజయనగరం జిల్లా ఏర్పడింది అన్నారు. ఈ రెండే గత డెబ్బయి ఏళ్ళ చరిత్రలో మన రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కొత్త జిల్లాలు అంటూ వ్యాఖ్యానించారు. అసలు మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత..హైదరాబాద్ తో కలసి ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 1956 ఏర్పాటైంది. దీంతో చూసుకున్నా కూడా ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు అయి కూడా ఇప్పటికీ ఇంకా 70 సంవత్సరాలు కాలేదు. కానీ జగన్ మాత్రం 1970లో ప్రకాశం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటు అయ్యాయని..ఈ డెబ్బయి సంవత్సరాల్లో కొత్తగా ఏర్పాటు అయింది ఈ జిల్లాలే అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు ఈ డెబ్బయి సంవత్సరాల నెంబర్ ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావటంలేదని ఓ నేత వ్యాఖ్యానించారు. అంతే కాదు..పాత జిల్లాల పేర్లు మార్చలేదని చెబుతూ రాజమహేంద్రవరం జిల్లాను రాజమహేంద్ర వర్మ అంటూ వ్యాఖ్యానించటం మరో విశేషం.