ఒక బాంబు రెండుసార్లు పేలుతుందా?
తాకట్టును విడిపిస్తానని కదా జగన్ అప్పుడు చెప్పింది!
ఎన్నికలకు ముందు జగన్ చెప్పింది ఏంటి?. చంద్రబాబు పెట్టిన తాకట్టును విడిపిస్తానని కదా?. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే తాటతీసి మరీ ప్రత్యేక హోదాను సాధిస్తానని కదా చెప్పింది?. జగన్ అడిగినట్లే ఏపీ ప్రజలు ఆయనకు ఏకంగా 22 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ జరుగుతుంది ఏంటి?. చంద్రబాబు చేయలేకపోయిన పనిని తాను చేస్తానని..తనకు ఎంపీలిస్తే చాలు అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం అడుగుతూనే ఉంటాం అంటూ కొత్త రాగం అందుకున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ తన మ్యానిఫెస్టోలో పెట్టిన నవరత్నాలది 50 శాతం వాటా అయితే..మిగిలిన 50 శాతం ప్రత్యేక హోదా అంశానిదే. ఎందుకంటే జగన్ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని అంతలా వాడుకున్నారు. అసలు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు...ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయని..అదే ఏపీకి సంజీవిని అని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఎంపీలు ఇవ్వండి చాలు హోదా సాధించి తీరుతానని చెప్పిన జగన్ ఇప్పుడు రకరకాల కారణాలను సాకుగా చూపుతున్నారు. జగన్ చెబుతున్న కారణాల ప్రకారం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాకూడదన్న మాట. అది ఎప్పటికి అవుతుంది..ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పటికి వస్తుంది. అప్పటివరకూ ఎన్నికలకు ముందు చెప్పినట్లే వచ్చే ఎన్నికల వరకూ జగన్ ప్రత్యేక హోదా నెపాన్ని చంద్రబాబుపైనే నెట్టేస్తూ పోతారా?. ఒకే అంశం జగన్ కు రెండుసార్లు రాజకీయంగా లాభం చేస్తుందా?. ఒక బాంబు రెండు సార్లు పేలుతుందా?.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు.
అంతే కాదు..ప్రత్యేక హోదాపై ఆయన రకరకాల మాటలు మార్చారు. అప్పట్లో అవే వైసీపీకి పెద్ద అస్త్రాలుగా మారాయి. వాటిని వాడుకునే..చంద్రబాబు హోదా ను వదిలేయటం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పటంలో జగన్, వైసీపీ నేతలు అప్పుడు సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాజీపడ్డారు.. రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలను పూర్తి చేయలేదనే కారణాలతో ప్రజలు గత ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారు. ఎవరూ ఊహించని మెజారిటీతో ఎమ్మెల్యేలు, ఎంపీలను దక్కించుకున్న తర్వాత కూడా జగన్ నెపాన్ని చంద్రబాబుపై నెట్టి తప్పించుకోవటం సాధ్యం అవుతుందా?. ప్రజలు జగన్ వాదనతో ఏకీభవిస్తారా? వేచిచూడాల్సిందే. కారణాలు ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి జగన్ ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజకీయంగా అది ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రచారమే తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. శుక్రవారం నాడు తాడేపల్లిలో జాబ్ క్యాలండర్ విడుదల చేస్తూ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్ర త్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు.