చంద్రబాబుకు ఘాటుగా చెప్పి..కెసీఆర్ పై జగన్ పూలు..!
అకస్మాత్తుగా జల వివాదాన్ని తెరపైకి తెచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్. అప్పటివరకూ అసలు ఈ అంశం ఎక్కడా చర్చల్లోనే లేదు. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి..గొడవ చేశాయి. తర్వాత వాళ్ళు కూడా వదిలేశారు. తాజాగా సీఎం కెసీఆర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత మంది తెలంగాణ మంత్రులు అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని నరరూప రాక్షసుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కంటే జగన్ మరింత దారుణంగా తయారయ్యారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకూ ఈ అంశంపై ఏపీలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాత్రమే స్పందిస్తూ వస్తున్నారు. తొలిసారి సీఎం జగన్ బహిరంగ వేదికపై నుంచి ఈ అంశంపై మాట్లాడారు. అందులో కొంత మంది తెలంగాణ మంత్రులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ప్రస్తావించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు రోజులు గమ్ముగా ఉన్నాడు..ఇప్పుడు వచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చేసిన కేటాయింపుల ప్రకారం ఎవరికి కేటాయించిన నీళ్ళు వారు వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నా అన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడికి కాస్త ఘాటుగా చెప్పదలచుకున్నా..అయ్యా చంద్రబాబు ఇవాళ నువ్వు మాటలు మాట్లాడుతున్నావు గతంలో నువు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి, డిండి ఈ ఎత్తిపోతల పథకాలకు ఆయన శ్రీకారం చుడుతున్నప్పుడు నువ్వు ఏమి గాడిదలు కాశావు చంద్రబాబునాయుడు అని అడుగుతున్నా. చంద్రబాబుపై పదే పదే చూపించిన ఘాటు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కెసీఆర్ విషయంలో చూపించలేదు. అంతే కాకుండా ఇదేదో జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడు..కర్ణాటక రాజకీయాల్లో,,తమిళనాడురాజకీయాల్లో వేలు పెట్డలేదు..పెట్టబోడు అంటూ వ్యాఖ్యానించారు.
రైతు ఎక్కడున్నా రైతే అని..అందరూ బతకాలి అని వ్యాఖ్యానించారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలి అని..గొడవలు మంచిదికాదన్నారు. రైతులు అన్ని చోట్లా చల్లగా ఉండాలన్నారు. ఓ వైపు తెలంగాణ సర్కారు అక్రమాలు చేస్తోంది..అన్యాయం చేస్తోంది అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి రెండుసార్లు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి, కెఆర్ఎంబీకి పదే పదే లేఖలు రాసిన జగన్ తాజా తన ప్రసంగంలో చంద్రబాబుపై పదే పదే ఘాటుగా..ఘాటుగా అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంపై కానీ...సీఎం కెసీఆర్ పేరు కూడా ప్రస్తావించకపోవటం చర్చనీయాశంగా మారింది. ఓడిపోయి ఇంట్లో ఉన్న చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసి.వివాదానికి కారణమైన కెసీఆర్ ను మాత్రం పూలతో అలా కొట్టినట్లు జగన్ తీరు ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబు విమర్శలకు అతీతుడు...విమర్శలు చేయకూడదనేమీ కాదు..కానీ అసలు వివాదానికి కారణమైన కెసీఆర్ విషయంలో జగన్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఇదే జగన్ కాళేశ్వరానికి వ్యతిరేకంగా దీక్షలు చేయటమే కాకుండా..ఇది కడితే ఏపీ ఎడారి అవుతుందని ప్రతిపక్షం లో ఉండగా విమర్శలు చేసి తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఓ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.