చంద్రబాబు తెలంగాణ ఫోకస్...జగనే తెగ ఫీల్ అవుతున్నారే?!
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌత్ పీస్ అయిన సజ్జల రామకృష్ణ రెడ్డి కొద్దిరోజుల క్రితం మీడియా తో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని చెప్పారు. అది వంద శాతం నిజం. అందులో తప్పేమి లేదు. పోటీ చేసిన పార్టీ ని గెలిపించాలా వద్దా అన్నది నిర్ణయించాల్సింది ప్రజలు. కానీ జగన్ మాత్రం తాజాగా ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ మీటింగ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మీటింగ్ పై బిఆర్ఎస్ నేతలు..మంత్రులు చంద్రబాబు పై ఎటాక్ చేస్తున్నారు. ఈ తరుణంలో జగన్ చేసిన వ్యాఖలు కీలకంగా మారాయి. 'చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అని.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఏపీ ప్రజల సంక్షేమమే నా విధానం. నేను ప్రజలనే నమ్ముకున్నాను. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు. ' అంటూ సంచలన వ్యాఖలు చేశారు. నిజానికి చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేస్తే జగన్ ఒకింత సంతోషించాలి. ఎందుకు అంటే ఆ మేరకు కొంత సమయం ఆంధ్ర ప్రదేశ్ పై ఫోకస్ తగ్గుతుంది కాబట్టి. తనకు అసలు చంద్రబాబు ఏ విధంగా పోటీ కాదు అనుకుంటే ఇది పట్టించుకోవాల్సిన పని లేదు.
మరో వైపు జగన్ తనకు తెలంగాణ లో అసలు పోటీ చేసే ఆలోచన లేదన్నట్లు మరో సారి ఈ వ్యాఖల ద్వారా సంకేతం పంపారు. అంటే తనకు ఏ మాత్రం రాజకీయ ఆశలు లేని రాష్ట్రంలో చంద్రబాబు ఏమి చేస్తే జగన్ కు ఎందుకు అన్న ప్రశ్న ఉదయించక మానదు. అదే సమయంలో విభజనవాదం తో పార్టీ పెట్టిన కెసిఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. జగన్ నిర్ణయాలు...జగన్ మాటలు చూస్తుంటే అయన సీఎం కెసిఆర్ ప్రయోజనాల కోసమే ఇలా మాట్లాడినట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు చంద్రబాబు కంటే తనకే ఈ ప్రాంతం పై ప్రేమ ఎక్కువ ఉందనే సంకేతం ఈ వ్యాఖల ద్వారా పంపే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. జగన్ తాజాగా చేసిన వ్యాఖలు కెసిఆర్ ప్రయోజనాలు కాపాడటానికే అన్న చర్చ సాగుతోంది. కెసిఆర్ బిఆర్ఎస్ నిర్ణయం తర్వాత కూడా వైసీపీ తెలంగాణ వైపు చూడకూడదు అని నిర్ణయించుకుంది అంటే అది వై ఎస్ షర్మిల పార్టీ కి మేలు చేయటం లేక...కెసిఆర్ కు ప్రయోజనం చేకూర్చటం కోసమే అన్న అభిప్రాయం నేతల్లో ఉంది.