అక్కడ నవ్వారు...ఇక్కడ విలవిల!
ఏపీ సర్కారు స్క్రిప్ట్ కు టాలీవుడ్ ప్రముఖుల షాక్!
టాలీవుడ్ కథ సుఖాంతం అయినట్లే పైకి కన్పిస్తోంది. అసలు దీని వెనక జరిగింది ఏమిటి?. శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశంలో లోపల ఏమి జరిగింది. అక్కడ నవ్విన టాలీవుడ్ ప్రముఖులు అంతా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకు విలవిలలాడుతున్నారు. తమ సన్నిహితుల వద్ద జరిగింది చెప్పుకుని బిక్కమొహం వేస్తున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. సంచలన సినిమాలకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా పేరు సాధించిన దర్శకుడు రాజమౌళి, వందకుపైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ గా పేరుగాంచిన చిరంజీవి వంటి వాళ్లు అందరూ కూడా సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశం పక్కా..పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారం జరపటంతో అవాక్కు అవటం వీరి వంతు అయింది. అసలు ఈ సమావేశానికి గత కొన్ని రోజులుగా ఎక్కడా కన్పించని పోసాని కృష్ణ మురళి రావటం అత్యంత కీలకంగా మారింది. అంతే కాదు సీఎం జగన్ ఎదురుగా ఆయన రెండు విడతలుగా హీరోలపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యలో వారించినట్లు కన్పించినా ఈ సమావేశానికి హాజరైన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివలకు పంపాల్సిన మెసేజ్ పంపారు. అంతే కాదు..నారాయణమూర్తిని రంగంలోకి దింపింది కూడా సీఎంవోనే అని టాలీవుడ్ టాక్.
ఈ సమావేశంలో ఆయన చిన్న సినిమాల తరపున మాట్లాడుతూ టార్గెట్ చేయాల్సిన వారిని సమావేశంలోనే టార్గెట్ చేసి పని పూర్తి చేశారు. తాము తలచుకుంటే ఎలా ఉంటుందో అనే మెసేజ్ ఇవ్వటానికే ఇది అంతా జరిగిందని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుడు ఒకరు విలవిలలాడుతూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అసలు ఈ చర్చలకు పేర్ల ఎంపిక కూడా ఓ పక్కా ప్లాన్ ప్రకారం చేశారని..సమావేశం కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఓ ప్రముఖుడు తెలిపారు. జగన్ తో జరిగిన చర్చల్లో రాజమౌళి, కొరటాల శివతోపాటు యాత్ర సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి రాఘవ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం జరిగిన తీరు చూసిన వీరంతా ఈ రాజకీయ స్క్రిప్ట్ ల ముందు తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం వీళ్లకు అర్ధం అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. చిరంజీవి ఈ సమావేశంలో సీఎం జగన్ ముందు మాట్లాడిన మాటలు చూస్తే కూడా టిక్కెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని ఎంతగా వేడుకున్నారో తెలిసిపోతుంది.