Telugu Gateway
Telugugateway Exclusives

జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న దుమారం

జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న దుమారం
X

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న‌పై రాజ‌కీయ దుమారం రేగుతోంది. అంతే కాదు..సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి ఏకంగా ప్ర‌త్యేక విమానంలో దావోస్ వెళ్ల‌టం కూడా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. స‌హ‌జంగా ఇలాంటి స‌మావేశాలు ఉన్న‌ప్పుడు సీఎంలు అధికారిక కార్య‌క్ర‌మాల త‌ర్వాత కొన్ని రోజులు కుటుంబంతో గ‌డుపుతుంటారు. అయితే ఆ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో వారి వారి ప‌ర్య‌ట‌న‌ల‌కు ముందో..త‌ర్వాతో కుటుంబ స‌భ్యుల‌ను ఆయా దేశాల‌కు పంపిస్తుంటారు. కానీ సీఎం జ‌గ‌న్ త‌న భార్య భారతితో క‌ల‌సి ప్ర‌త్యేక విమానంలో దావోస్ వెళ్ళారు. అధికారుల అంత‌కు ముందే అక్క‌డ‌కు చేరుకుని ఏపీ పెవిలియ‌న్ సిద్ధం చేయ‌టంతోపాటు ఇత‌ర ప‌నుల పూర్తి చేశారు. దేశం నుంచి రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని వంటి వారే ప్ర‌త్యేక విమానాల్లో విదేశాల‌కు వెళ‌తారు. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రుల‌కు నేరుగా అలా వెళ్ళ‌టానికి అనుమ‌తి ఉండ‌దు. ప్రైవేట్ వ్య‌క్తుల‌..ప్రైవేట్ ప‌ర్య‌ట‌న‌లు..సంప‌న్నులు ఎలా వెళ్ళినా వారికి అభ్యంత‌రాలు ఉండ‌వు. కానీ అధికారిక హోదాలో ఉన్న సీఎంలు అలా వెళ్ళాలంటే ఖ‌చ్చితంగా కేంద్రం ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాలి. అందులోనూ ప్ర‌త్యేక విమానంలో అంటే మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే.

కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు, ఏపీ సీఎంకు జ‌గ‌న్ మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నందున ఇది పెద్ద అంశమేమీ కాదు. అయితే గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న సమ‌యంలో ఉండ‌గా ఓ సారి ప్ర‌త్యేక విమానంలో సింగపూర్ వెళితే అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు అప్ప‌ట్లోనే ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఇదే వైసీపీతోపాటు జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల ప‌ర్య‌ట‌న‌ల‌పై గ‌తంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వారే. కానీ అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ కూడా అచ్చం చంద్ర‌బాబు మోడ‌ల్ నే ఫాలో అవుతున్నారు. దేశీయ ప‌ర్య‌ట‌న‌లు అయినా..విదేశీ ప‌ర్య‌ట‌న‌లు అయినా ప్ర‌త్యేక విమానాలే అన్న చందంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాదు గ‌తంలో వైసీపీ నేత‌లు అంద‌రూ దావోస్ స‌మావేశాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వారే.

వైసీపీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి అంబ‌టి రాంబాబు గ‌తంలో డ‌బ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని చంద్ర‌బాబు దావోస్ స‌మావేశాల‌కు వెళ్ళారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి సీఎం జ‌గ‌న్ ఇప్పుడు ఎలా వెళ్ళిన‌ట్లు?. మ‌రో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా రాష్ట్రంలో పెట్టుబ‌డుల వాతావ‌ర‌ణం క్రియేట్ చేయాలి కానీ..దావోస్ ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు అంటూ వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబ‌డుల వాతావ‌రణం ఉందా?. జ‌గ‌న్ ఎందుకు దావోస్ వెళ్ళిన‌ట్లు?. ఈ వీడియోల‌ను టీడీపీ త‌న అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసి వైరల్ చేస్తోంది. అంతే కాదు..సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న అని కోర్టు అనుమ‌తి తీసుకుని..మ‌ధ్య‌లో లండ‌న్ వెళ్ళార‌ని టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. మొత్తం మీద సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న ప‌లు కోణాల్లో రాజ‌కీయ దుమారం రేపుతోంది.

Next Story
Share it