Telugu Gateway
Telugugateway Exclusives

చ‌క్రాలు తిప్పిన చంద్రుడు ఇంకా మోడీకి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు?!

చ‌క్రాలు తిప్పిన చంద్రుడు ఇంకా  మోడీకి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు?!
X

తెలుగుదేశం పార్టీ విచిత్ర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు గ‌తంలో ప్ర‌ధాని అభ్య‌ర్ధులను ఖ‌రారు చేశాం..రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధులు ఎంపిక చేశాం అని చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అస‌లు ఆ పార్టీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంది?. ఓటు వేస్తుందా లేదా అన్న అంశంపై కూడా ఎవ‌రికీ స్ప‌ష్టత లేదు. టీడీపీకి ఇప్పుడు ఏపీలో సాంకేతికంగా చూస్తే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాంకేతికంగా అన్న మాట ఎందుకు వాడాల్సి వ‌చ్చింది అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కొంత మంది ఇప్పుడు అన‌ధికారికంగా వైసీపీతో జ‌ట్టుక‌ట్టిన విష‌యం తెలిసిందే. విప్ జారీ చేస్తే వీరు పార్టీ లైన్ కు అనుగుణంగానే ఓటు వేయాల్సి ఉంటుంది. పార్ల‌మెంట్ విష‌యానికి వ‌స్తే ముగ్గురు లోక్ స‌భ స‌భ్యులు. రాజ్య‌స‌భ‌లో ఒక్క క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ మాత్ర‌మే మిగిలారు. ఎన్డీయే అభ్య‌ర్ధి ద్రౌప‌ది ముర్ముకు ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ ప్ర‌తినిధుల నుంచి ఫోన్ అయితే వ‌చ్చింద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హా ఏపీకి వ‌స్తాన‌న‌గా..టీడీపీ బాబోయ్ ఇటు రావ‌ద్దంటూ వేడుకుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

అధికారం కోల్పోయిన‌ మూడేళ్ల త‌ర్వాత కూడా బిజెపికి టీడీపీ ఎందుకింత భ‌య‌ప‌డుతుందో అర్ధం కావటం లేదంటూ కొంత మంది నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో విమర్శ‌ల‌పై చూపించే దూకుడులో బిజెపి విష‌యంలో మాత్రం నిల్. ఛాన్స్ వ‌చ్చినా జ‌గ‌న్ కేంద్రం..ప్ర‌ధాని మోడీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్ట‌కుండా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో భేష‌ర‌తు మ‌ద్ద‌తుపై మీడియాలో అయితే క‌థ‌నాలు వచ్చాయి కూడా చంద్ర‌బాబు నోరుతెరిచి ఈ అంశంపై మాట్లాడింది లేదు. విచిత్రం ఏమిటంటే ఏపీకి ప్ర‌త్యేక హోదాతోపాటు విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌క‌పోయినా అధికార వైసీపీ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తిప‌క్ష టీడీపీ, మిత్ర‌ప‌క్ష జ‌న‌సేన వ‌ర‌కూ ఎవ‌రూ బిజెపిని ఏమీ అన‌రు. అంతే కాదు..జులై 18న జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో అధికార వైసీపీతోపాటు ప్ర‌తిప‌క్ష టీడీపీ కూడా ద్రౌప‌ది ముర్ముకే ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విష‌యంలో మాత్రం టీడీపీ నేత‌లు అంతా గ‌ప్ చుప్ అన్నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌ప్పుడు చ‌క్రాలు తిప్పాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు ఇప్పుడు బ‌హిరంగంగా ఎవ‌రికి ఓటు వేసేది కూడా చెప్పుకోలేని..చెప్ప‌లేని ప‌రిస్థితికి చేరుకోవ‌టం విచిత్రం.

Next Story
Share it