నారా లోకేష్ కు చంద్రబాబు షాక్?!
చంద్రబాబు ప్రజాయాత్రతో నారా లోకేష్ పాదయాత్ర లేనట్లేనా?
తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ ప్రారంభం అయింది. సుదీర్ఘ పాదయాత్ర చేయటం ద్వారా రాష్ట్రంలో ఓ బలమైన నేతగా ఎదిగేందుకు నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలకు స్వయంగా చంద్రబాబే గండికొట్టారా?. పార్టీలో నారా లోకేష్ కు అంతగా ఆమోదం లభించని తరుణంలో ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు వ్యూహం మార్చారా?. ఈ వయస్సులోనూ చంద్రబాబు మరో సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా? అన్న చర్చ తెలుగుదేశంలో ప్రారంభం అయింది. త్వరలోనే ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు త్వరలో ఒక ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం నాడు ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన 'వస్తున్నా.. మీకోసం' యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇది టీడీపీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఓ వైపు నారా లోకేష్ గతంలో ప్రస్తుత సీఎం జగన్ చేసిన పాదయాత్రను అధిగమించేలా తన యాత్రకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అధికారికంగా ఎప్పుడూ దీనిపై ప్రకటన చేయకపోయినా అంతర్గతంగా మాత్రం ఈ సన్నాహాల విషయాలను పార్టీ నేతలు నిర్ధారించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని తలపెట్టారు. అయితే ఈ తరుణంలో చంద్రబాబు పజాయాత్ర ప్రకటన చేయటం కీలకంగా మారింది. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబులా కాదని..తమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించిన 151 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ 22 మంది ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి ప్రత్యేకంగా సాదించింది ఏమీ లేకపోగా...అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అన్నింటిని కేంద్రం తుంగలో తొక్కినా మౌనంగా చూస్తుండిపోతుంది తప్ప..పోరాడిన దాఖలాలు లేవు. అంతే కాదు తెలంగాణతో ఇంకా పరిష్కారం కాని విభజన అంశాలు కూడా ఎక్కడవి అక్కడే పెండింగ్ లో ఉన్నాయి.
ప్రత్యేక హోదాపై అడుగుతూ ఉండటం తప్ప..చేయగలిగింది ఏమీలేదనే జగన్ ఇప్పటికే పలుమార్లు చేతులెత్తేశారు. దీంతోపాటు వైసీపీ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత ప్రారంభం అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వంలో కుప్పలకు తెప్పలుగా సలహాదారులు ఉన్నా పరిపాలన విషయంలో వైసీపీ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే సమయంలో కోర్టుల్లోనూ ఎదురుదెబ్బలు తప్పటం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఇప్పుడు ఇసుక ధర ఎక్కువగా ఉందని అంతర్గత సంభాషణల్లో వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. మరి మరి ఈ విషయాలన్నింటిని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోగలదా?. చంద్రబాబు ఒక వైపు..నారా లోకేష్ మరో వైపు యాత్రలు ప్లాన్ చేస్తారా?. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆకస్మికంగా చంద్రబాబు ప్రజాయాత్ర ప్రకటన మాత్రం నారా లోకేష్ పాదయాత్రపై పలు అనుమానాలకు తావిచ్చేలా చేసిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ కు పూర్తిగా బాద్యతలు అప్పగిస్తే కష్టం అనే అభిప్రాయం కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.