చంద్రబాబు...లోకేష్...ఓ పట్టాభి!
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలక నేతల 'లైన్' ఇది. ముందు చంద్రబాబు, తర్వాత లోకేష్..ఆ తర్వాత పట్టాభిరామ్. వీరి ముగ్గురి తర్వాతే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా. ప్రస్తుతం తెలుగుదేశంలో పట్టాబిరామ్ హవా నడుస్తోంది. పొలిట్ బ్యూరో సభ్యులకు లేని ప్రాధాన్యత కూడా ఆయనకు లభిస్తోంది. చంద్రబాబుతోపాటు నారా లోకేష్ కూడా పట్టాభికి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నారు. అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ కు మంచి వాయిస్ ఉంది..అంశాలను ప్రజంట్ చేసే విధానం కూడా ఓకే. అయితే చాలా సార్లు ఇది శృతి మించుతుందనే విమర్శలు పార్టీ సీనియర్ నేతల నుంచే విన్పిస్తున్నాయి. గట్టిగా వాదన విన్పించటం అంటే గట్టిగా మాట్లాడటం కాదని..కేసును ప్రజంట్ చేసే తీరులోనే ఇది ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. ఇదే టీడీపీ ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులకు కారణం అయింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో డ్రగ్స్ శాంపిల్స్ ఇస్తామంటూ..పట్టాబితోపాటు అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ వంటి యువనేతలు కొంత మంది హైదరాబాద్ వచ్చారు. అదే రోజు ఏపీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యక్రమం ఒకటి సాగింది. అయితే అచ్చెన్నాయుడి కార్యక్రమాన్ని కూడా కాదని మీడియా కవరేజ్ కు సంబంధించిన కిట్ ను పట్టాభి అండ్ టీమ్ కే పెద్దలు కేటాయించారని ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
దీంతోపాటు కొద్దిరోజుల క్రితం కాకినాడ పర్యటన సమయంలో కూడా మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు ఇతర కీలక నేతల విషయంలో కూడా పట్టాభి వ్యవహరించిన తీరు సరిగాలేదని పార్టీ నేతలు వెల్లడించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కీలక నేతలు చాలా మంది ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. చంద్రబాబు కూడా అలాంటి వారిని కష్టకాలంలో మీరు పార్టీ కోసం ఎందుకు పనిచేయరు అని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. పోనీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళే వచ్చి ముందు వరసలో నిలుచుంటారని..అప్పటివరకూ పనిచేసిన వారికి మాత్రం మళ్ళీ హ్యాండ్ ఇవ్వటం పార్టీలో ఎప్పటినుంచో సాగుతుందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు..గట్టిగా వాదన విన్పించేవారు ఉన్నా చంద్రబాబు, లోకేష్ లు మాత్రం తాము కోరుకున్న వారితోనే అవి బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీంతోపాటు పట్టాభి కొన్ని ఛానళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తూ షో అంతా తానే నడిపిస్తున్నారనే విమర్శలూ పార్టీ వర్గాలు నుంచి విన్పిస్తున్నాయి.