Telugu Gateway
Telugugateway Exclusives

కవిత విచారణ..నెక్స్ట్ ఏంటి?!

కవిత విచారణ..నెక్స్ట్ ఏంటి?!
X

సిబిఐ విచారణలో సెక్షన్ నంబర్లు మారుతున్నాయి. తొలుత సిఆర్ పీసి 160 కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు..ఇప్పుడు సిఆర్ పీసి 91 కింద నోటీసులు ఇచ్చారు. అంటే దీని అర్ధం విచారణ జరిగే కొద్ది సిఆర్ పీ సి సెక్షన్ల నంబర్లు మారుతున్నాయి. తొలుత సాక్షిగా వివరాల సేకరణే..ఇది విచారణ ఏ మాత్రం కాదు అంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆదివారంనాడు దగ్గర దగ్గర ఏడు గంటల పాటు విచారించిన తర్వాత ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చి సిఆర్ పీసి 91 కింద మరో నోటీసు ఇచ్చినట్లు చెపుతున్నారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం లో నెక్స్ట్ ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఆలా విచారణ ముగిసిందో లేదో..ఇలా ఎమ్మెల్సీ కవిత వెంటనే తన తండ్రి, సీఎం కెసిఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కి వెళ్లి గంట పాటు సమావేశం అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది చూసిన వారంతా ఎంత టెన్షన్ ఉంటే ఇలా వెంటనే ప్రగతి భవన్ వెళతారు అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి దగ్గరికి వెళ్లటాన్ని ఎవరు తప్పు పట్టారు కానీ...సిబిఐ విచారణకు ముందు పలు మార్లు భేటీ అయ్యారు...విచారణ తర్వాత కూడా వెంటనే సీఎం కెసిఆర్ తో సమావేశం కావటం కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాములో విచారణ మరింత ముందుకు సాగేందుకు వీలుగా కోర్ట్ కానీ..విచారణ అధికారి సెక్షన్ 91 సిఆర్ పీ సి కింద నోటీసులు ఇస్తారు. ఆదివారం నాటి విచారణలో సిబిఐ అధికారులు ఇప్పటికీ తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా ప్రశ్నలు వేసి ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు తీసుకున్నారు.

ఇప్పుడు ఆమెనే ఎవిడెన్స్ అడిగారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణ సంస్థల దగ్గర చాలా సమాచారం ఉందని..కొత్తగా ఇచ్చే నోటీసుల కింద కవిత అసలు ఏమి ఇస్తారు...అవి విచారణ సంస్థల దగ్గర ఉన్న వాటితో సరిపోలుతుందా అన్నది చెక్ చేసుకుని తదుపరి అడుగులు వేస్తారని చెపుతున్నారు. ఈ డీ కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరున ప్రస్తావించటంతో పాటు ఆమె రెండు నంబర్లు మార్చారు..పది ఫోన్లు ధ్వంసం చేశారు అని పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ఈ లిక్కర్ స్కాం అంశం బీఆర్ఎస్ పార్టీ లో కలకలం రేపుతోంది. ఇదే తరుణంలో సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకొంది.. తొలుత ఈ నెల 14 న ఢిల్లీలో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు..కానీ ఇప్పుడు ఇది ముందుకు జరిగి కెసిఆర్ సోమవారమే ఢిల్లీ వెళుతున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. షెడ్యూలు కంటే ముందే ఎన్నికలు రావొచ్చు అని బలంగా ప్రచారంలో ఉంది. ఈ తరుణంలో లిక్కర్ స్కాములో స్వయంగా సీఎం కెసిఆర్ కుమార్తె ఇందులో విచారణ ఎదుర్కోవటం పార్టీ కి నష్టం చేసే అంశమే అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది.

Next Story
Share it