Telugu Gateway
Telugugateway Exclusives

'ఆద‌ర్శ పాల‌నకు' భ‌వ‌నాలు అద్దం ప‌డ‌తాయా?

ఆద‌ర్శ పాల‌నకు  భ‌వ‌నాలు అద్దం ప‌డ‌తాయా?
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ శ‌నివారం నాడు కొత్త‌గా క‌డుతున్న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప‌నులు వేగం పెంచాల‌ని ఆదేశించారు. ఆ త‌ర్వాత సీఎంవో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అదేంటి అంటే.. 'తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతున్నదని, అత్యాధునికత, సాంకేతికత విధానాలను అందిపుచ్చుకుని సౌకర్యవంతమైన రీతిలో ప్రజల వద్దకే పాలనా ఫలాలు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించి సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం ఆదేశించారు.' ఇదీ ప్ర‌క‌ట‌న‌లోని ఓ భాగం. అస‌లు 'ఆద‌ర్శ పాల‌నకు' భ‌వ‌నాలు అద్దం ప‌డ‌తాయా?. ఆద‌ర్శంగా పాలన ఇవ్వాలంటే ఈ దిశ‌గా చేయాల్సింది ప‌రిపాలించే నేత‌లు..అక్క‌డ ప‌నిచేసే అధికారులు. అంతే కానీ భ‌వ‌నాల‌కు, ఆద‌ర్శాల‌కు సంబంధం ఏముంటుంది. కొత్త స‌చివాల‌యంపై వివాదాలు ఎన్నో. అస‌లు ఈ స‌చివాల‌యం ప‌నుల చుట్టూనే ఎన్నో వివాదాలు, విమర్శ‌లు ఉన్నాయి.

కొత్త స‌చివాల‌య‌ ప‌నులు ప్రారంభం కాక‌ముందే ఈ భ‌వ‌నానికి సంబంధించిన అంచ‌నాలు అమాంతం పెరిగాయి. స‌ర్కారు ఖ‌రారు చేసిన అంచ‌నాల ప్ర‌కారం ఎస్ఎఫ్ టి కి నిర్మాణ వ్యయం ఇక్క‌డ భూమి లేకుండానే 8842 రూపాయలు అవుతుంది..కేవలం నిర్మాణ వ్యయమే ఆరు ఫోర్లకు 400 కోట్లు అని తొలుత అంచ‌నా వేసి ఆ త‌ర్వాత ఏడు ఫోర్లకు 619 కోట్లుగా మార్చారు. లక్ష చదరపు అడుగులకు..ఒక్క ఫోర్ కు 219 కోట్ల పెరుగుదల‌పై సీనియ‌ర్ ఇంజ‌నీర్లే అవాక్కు అయ్యారు. తెలంగాణ‌లో ఒక్క భ‌వ‌నాలే కాదు సాగునీటి శాఖ‌లోనూ వంద‌ల కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌ పెంపు చాలా కామ‌న్ అయింది. ముఖ్య‌మంత్రి కెసీఆర్ చెబుతున్న ఆద‌ర్శ‌పాల‌న‌కు అద్దం ప‌ట్ట‌నున్న భ‌వ‌నం అంచ‌నాలు కూడా ప‌నులు పూర్త‌య్యేలోపు ఇంకా ఎంత పెరుగుతాయో చూడాల్సి ఉంద‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it