Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ మద్దతు మూడు రాజధానులకా..అమరావతికా?!

కెసిఆర్ మద్దతు మూడు రాజధానులకా..అమరావతికా?!
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తొలి సవాలు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే రాబోతుంది. అది ఎలా అంటే విభజనవాదంతో ప్రత్యేక పార్టీ పెట్టి విజయం సాధించిన కెసిఆర్ ఇప్పుడు దేశ గతిని మార్చేది తానే అని చెపుతున్నారు. తెలంగాణ మోడల్ దేశం అంతా అమలు చేస్తామని ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ కోణం నుంచి జాతీయ దృక్పధం కోసం పేరును కూడా భారత్ రాస్త్ర సమితి (బిఆర్ఎస్ )గా మార్చుకున్నారు. వెంటనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ లెక్కన బిఆర్ఎస్ దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీచేయటం ఖాయంగా కనిపిస్తోంది. సహజంగానే పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనే బిఆర్ఎస్ పోటీ చేయటం ఖాయం. ఇప్పటికే బిఆర్ఎస్ కు అనుకూలంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్లెక్లిలు కూడా వెలిశాయి. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఒక బహిరంగ సభ పెడతారని..ఈ బాధ్యత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయవచ్చు...ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అత్యంత కీలకం అయిన విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సారథ్యంలో నడుస్తున్న సర్కారు ముందు ప్రకటించిన రాజధాని అమరావతి కాదని...మూడు రాజధానుల నినాదాన్ని అందుకుంది.

ఏపీలో పోటీ చేయటానికి సిద్ధం అవుతున్న బిఆర్ఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ఇస్తారా...లేక తాను స్వయంగా పాల్గొన్న అమరావతి ఒకటే రాజధానికి మద్దతు ఇస్తారా అన్నది ఇప్పుడు కీలకం కాబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తో పోలిస్తే జగన్ తోనే కెసిఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక సారి మీడియా సమావేశంలో జర్నలిస్టుల నుద్దేశించి మాట్లాడుతూ మీరు ఏమి చేసినా జగన్ కు, తనకు గొడవపెట్టలేరంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇది ఒక ఎత్తు అయితే 2024 జూన్ లోగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం వంటి వాటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఇదే అంశంపై అకస్మాతుగా సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. దీనిపై మరి కెసిఆర్ వైఖరి కూడా రాబోయే రోజుల్లో కీలకం కానుంది. ఒకప్పుడు చంద్రబాబు ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితి కెసిఆర్ కు రాబోతోందా అనే చర్చ కూడా సాగుతుంది. ఏ రాష్ట్రములో పోటీచేసిన ఆ ప్రాంతానికి సంబంధించి పార్టీలు తమ వైఖరి చెప్పాల్సి ఉంటది. మరి ఇప్పుడు కెసిఆర్ ఏమి చేస్తారో వేచిచూడాలి.



Next Story
Share it