Telugu Gateway
Telugugateway Exclusives

రాష్ట్రం కెటిఆర్ కు...దేశం కవిత కా?!

రాష్ట్రం కెటిఆర్ కు...దేశం కవిత కా?!
X

ఇది ఇప్పుడు తెలంగాణ లోని అధికార బిఆర్ఎస్ లో హాట్ టాపిక్. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గత కొన్ని రోజులుగా జాతీయ మీడియా లో వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు...బిఆర్ఎస్ విధానాలపై మాట్లాడుతున్నారు. జాతీయ మీడియా కేవలం ఎమ్మెల్సీ కవిత నే ఫోకస్ చేస్తోంది. కానీ బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు కానీ...లోక్ సభలో ఆ పార్టీ నేత నామా నాగేశ్వర్ రావు కానీ ఎక్కడా కనపడరు. వీరిద్దరే కాకుండా ఏ అంశంపై అయినా మాట్లాడగల సత్తా ఉన్న ఉమ్మడి రాష్ట్ర శాసన సభ స్పీకర్, ప్రస్తుత బిఆర్ఎస్ రాజ్య సభ సభ్యుడు సురేష్ రెడ్డి కూడా అసలు ఎక్కడా కనిపించరు. అసలు సమావేశాలు ఉంటే తప్ప తప్ప బిఆర్ఎస్ ఎంపీలు అంతా గప్ చుప్ అన్న చందంగానే ఉంటున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ తరపున జాతీయ రాజకీయ అంశాలు అన్నీ ఎమ్మెల్సీ కవితే చూస్తున్నట్లు పార్టీ వర్గాలు కూడా చెపుతున్నాయి. అందుకే జాతీయ మీడియా లో కవిత మాత్రమే కనిపిస్తున్నారు. గతం లో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో కూడా కవిత నే వెంటబెట్టుకు తీసుకెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇది అంతా పక్క వ్యూహం ప్రకారమే చేస్తున్నారు అని చెపుతున్నారు. వచ్చేది కేంద్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ నాయకులు పైకి ఎన్ని చెప్పిన అది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు అని ఆ పార్టీ కే చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మాత్రం బేస్ లేకుండా కేవలం విధానాలు చూసి ఓటు వేయమంటే వేస్తారా అని అయన ప్రశ్నించారు. ఆర్థికంగా ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్న బిఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో వెసులుబాటును బట్టి ఇతరులను కలుపుని వచ్చే ఎన్నికలు పూర్తి అయ్యే నాటికీ తెలంగాణ తో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉనికి చాటే ప్రయత్నాల్లో ఉందని చెపుతున్నారు.

కవిత ను ఇలా జాతీయ రాజకీయాల్లో బిజీ గా ఉంచి తర్వాత ఆమె ను అక్కడ కేంద్ర మంత్రి ని చేసే లక్ష్యంతోనే ఇది అంతా చేస్తున్నారు అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేయటం కోసమే ఇది అంతా ప్లాన్ చేస్తున్నారు అని..అదే సమయంలో రాష్ట్రం లో అయినా..కేంద్రంలో అయినా పార్టీ తరపున అయినా కెసిఆర్ లేదంటే కెటిఆర్, కవిత తప్ప మరొకరు కనపడటానికి అక్కడ ఛాన్స్ ఉండదు అని చెపుతున్నారు. ఈ ముగ్గురు ఉండని చోట మాత్రమే మిగిలిన వాళ్ళు కనిపిస్తారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కనుసన్నల్లోనే అన్నీ విషయాలు సాగుతున్నాయని...సీఎం కెసిఆర్ తన అవసరం ఉన్న చోట తప్ప అంతా కెటిఆర్ కే అప్పగించారని చెపుతున్నారు. అలా రాష్ట్రం కెటిఆర్ కు, దేశ రాజకీయాలు కవితకు అప్పగించారు అని పార్టీ నేతలే చెపుతున్నారు. కెసిఆర్ మాత్రం వెనకుండి అన్నీ మానిటర్ చేస్తున్నారు అని...అవసరం అయినప్పుడే అయన బయటకు వస్తారు తప్ప..లేదు అంటే అటు కెటిఆర్ , ఇటు కవిత లు తమ పని తాము చేసుకుంటూ వెళతారని మరో నాయకుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా...పార్టీ తరపున అయినా మీడియా కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నది కెటిఆర్ మాత్రమే. కెసిఆర్ మాత్రం తాను మాట్లాడాలి అనుకున్నప్పుడు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ గా ఉన్న కవిత గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా కూడా జాతీయ రాజకీయ అంశాలపైనే స్పందిస్తున్నారు.

Next Story
Share it