Telugu Gateway
Telugugateway Exclusives

ప్రజల ఐక్యత అంటే అంతా బిఆర్ఎస్ లో చేరటమేనా?

ప్రజల ఐక్యత అంటే అంతా బిఆర్ఎస్ లో చేరటమేనా?
X

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?!

కేంద్రంలోని మోడీ సర్కారు ను పడగొడతాం అనే సవాళ్ల దగ్గరనుంచి బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరం అనే పరిస్థితి కి వచ్చింది తెలంగాణలోని అధికార బిఆర్ఎస్ వ్యవహారం. ఒక రాజకీయ పార్టీగా ఎలా ఉండాలన్నది పూర్తిగా ఆ పార్టీ ఇష్టమే. అందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ గతంలో ఆ పార్టీ కదలికలు.. ...ఆ పార్టీ అధినాయకుడు గతంలో చేసిన ప్రకటనలు మాత్రం కచ్చితంగా చర్చకు వస్తాయి. కావాల్సింది విపక్షాల ఐక్యత కాదు అని చెప్పే బిఆర్ఎస్, ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ కొద్ది నెలల క్రితం పాట్నా వెళ్లి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, మహారాష్ట్ర వెళ్లి ఎన్సీసిపీ అధినేత శరద్ పవార్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు వెళ్లి స్టాలిన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ లను ఎందుకు కలిసినట్లు. మళ్ళీ ఇప్పుడు కావాల్సింది విపక్షాల ఐక్యత కాదు అనే రాగం ఎందుకు అందుకున్నట్లు?. అసలు రోజుకో మాట చెప్పే సీఎం కెసిఆర్, కెటిఆర్ ల దగ్గర ఈ ప్రశ్నలకు సమాదానాలు ఉన్నాయా?

కెటిఆర్ :విపక్షాల ఐక్యత కాదు..ప్రజల ఐక్యత కోరుకుంటున్నాం.

దేశంలో పార్టీలు లేకుండా ప్రజల ఐక్యత ఎలా సాధ్యం అవుతుంది?. అయినా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ బలంగా ఉన్నది. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దృష్టిలో ప్రజల ఐక్యత అంటే దేశ ప్రజలు అందరూ బిఆర్ఎస్ కు మాత్రమే మద్దతు ఇవ్వాలని కోరుకోవటమా?. అసలు ప్రజల ఐక్యత అనే వాదనకు ఏ మాత్రమైనా హేతుబద్దత ఉందా? అసలు పార్టీయే భాగస్వామ్యం లేడుందా ఇది సాధ్యం అవుతుందా?

కెటిఆర్ : మోడీ, రాహుల్ చుట్టూనే రాజకీయాలు తిరగాలనుకోవద్దు?

తెలంగాణ లో బిఆర్ఎస్ చేసింది ఏమిటి?. అసలు రాష్ట్రంలో మరో పార్టీ ఏదీ ఉండకూడదు అనే తరహాలో విపక్ష ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలతో బిఆర్ఎస్ లో చేర్చుకుని తమకు ఎదురుగా..బలంగా మరో పార్టీ లేకుండా చేయాలనీ చూసింది బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కాదా?. తెలంగాణ లో తమకు తిరుగు లేకుండా చేసుకునేందు కెసిఆర్ వేసిన ఎత్తుగడలు ఎన్నో తెలంగాణ ప్రజలు చూడలేదా?

కెటిఆర్: బూతులు తిడితేనే..గట్టిగా గొంతు చించుకుంటేనే విమర్శలు చేసినట్లా?

కొద్ది నెలల క్రితం ఎవరు చెప్పారు అని ప్రధానిని పట్టుకుని మోడీ...బోడి..కేడి అని సీఎం కెసిఆర్ దగ్గర నుంచి మంత్రి కెటిఆర్ లు మాట్లాడినట్లు. అక్కడితో ఆగలేదు ఈడీ, సిబిఐ లతో ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ పరుష వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు...ఇప్పుడు అసలు తమకు పరుషమైన వ్యాఖ్యలే రావన్నట్లు బూతులు తిడితేనే విమర్శలు చేసినట్లా అని కెటిఆర్ ప్రశ్నించటం వెరైటీ.

సీఎం కెసిఆర్ నుంచి నోటి నుంచి కొద్ది నెలల క్రితం వచ్చిన ఆణిముత్యాలు..పార్టీలు కాదు..ప్రజలు గెలవాలి.

అసలు ప్రజలు ఎలా గెలుస్తారు. గత రెండు సార్లు బిఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలు గెలిచినట్లా..ఓడినట్లా?. దేశ ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలవటం..తమకు నచ్చినట్లు పాలించటం తప్ప ప్రజలు గెలవటం అంటే ఏమిటో అసలు ఎవరికైనా తెలుసా?. ఈ మాటలు చెప్పిన కెసిఆర్ ఏమైనా దీనిపై వివరంగా చెప్పగలరా?. ఎవరికీ అర్ధం కాకుండా ఉండాలి..లేదా అందరిని గందరగోళంలోకి నెట్టాలి అన్నప్పుడే ఇలాంటి పార్టీలు కాదు..ప్రజలు గెలవాలి, విపక్షాల ఐక్యత కాదు..ప్రజల ఐక్యత కోరుకుంటున్నాం వంటి డైలాగులు వస్తాయి.

దేశంలోని ఇతర పార్టీల మద్దదు లేకుండా కెసిఆర్, కెటిఆర్ లు ఇంత కాలం చెప్పినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటం అసలు సాధ్యం అవుతుందా?. తెలంగాణాలో ఉన్న 17 లోక్ సభ సీట్లతో బిఆర్ఎస్ హైదరాబాద్ నుంచి దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలుగుతుంది. ఇతరుల మద్దదు లేకుండా తెలంగాణ వెలుపల బిఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలుచుకునే అవకాశాలు ప్రస్తుతానికి అయితే లేవు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో బిఆర్ఎస్ కు అసలు ఎన్ని వస్తాయో తెలియదు. ఎప్పటికప్పుడు మారుతున్నా కెసిఆర్, కెటిఆర్ ల రాజకీయ సిలబస్ తో ఎక్కడో గట్టిగానే లెక్క తేడా కొట్టినట్లు కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it