Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ టార్గెట్స్ మారుతున్నాయంటే!

కెసిఆర్ టార్గెట్స్ మారుతున్నాయంటే!
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ది కూడా యూజ్ అండ్ త్రో పాలసీనేనా?.అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తొలుత తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యం అన్నారు. అది నెరవేరింది..రెండు సార్లు సీఎం అయ్యారు కెసిఆర్. ఇప్పుడు ఏకంగా పార్టీ లో నుంచి తెలంగాణ పేరు తీసేసి భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) పేరుతో ఇప్పుడు బంగారు భారత్ అంటున్నారు. ఇవి అన్నీ చూస్తుంటే ఊపిరి సినిమాలో నాగార్జున తన సహాయకుడిగా వచ్చిన కార్తీని నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే చెప్పే డైలాగు గుర్తుకు వస్తుంది అని ఒక మంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక రాజకీయ పార్టీలు, యువత, ఉద్యోగులు, జర్నలిస్ట్ లు ఇలా అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమానికి తమ వంతు మద్దతుగా నిలిచాయి. ఉద్యమంలో పాల్గొన్నాయి. ఎప్పుడు అయితే కెసిఆర్ రాజకీయ అవసరం తీరిపోయిందో అప్పటినుంచే అయన అన్ని వర్గాల విషయంలో తన అసలు వైఖరి చూపిస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఎక్కడివరకో ఎందుకు ఉద్యమ సమయంలో జెఏసి కి నాయకత్వం వహించిన కోదండరాం పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. కోదండరాం ఒక్కరే కాదు...ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యం అయింది అని...ఆమెను ఎప్పుడూ తెలంగాణ గుర్తుపెట్టుకుంటది అని అసెంబ్లీ వేదికగా చెప్పిన కెసిఆర్ తర్వాత అసలు ఇందులో కాంగ్రెస్ రోల్ ఏమీ లేదు అనే తరహా ప్రకటనలు చేయటం చూసిందే. తన రాజకీయ అవసరాల కోసం అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి సమావేశాలు అయిన పరిస్థితి చూసిందే. తెలంగాణ ఉద్యమంలో అయితే ఉద్యోగులు పాత్ర ఎనలేనిది. ఇప్పడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. కొంత మంది ఉద్యోగ సంఘ నాయకులను మేనేజ్ చేస్తే చాలు...ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా నడుస్తుంది అనే ధీమా లో సర్కారు ఉంది.

సమ్మె సమయంలో ఆర్ టిసి కార్మికులను బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పెట్టని రీతిలో కెసిఆర్ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే జర్నలిస్ట్ ల పరిస్థితి దారుణాతి దారుణం అని చెప్పాలి. ఇప్పుడు అయితే ఏకంగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులను కూడా సచివాలయంలోకి రానివ్వని పరిస్థితి. సీఎం కెసిఆర్ జర్నలిస్ట్ ల విషయంలో కూడా అదే స్ట్రాటజీని వాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు నేతలకు పదవులు ఇస్తే చాలు..మిగిలిన వాళ్ళను అసలు పట్టించుకోక పోయిన పర్వాలేదు అన్న చందంగా ఉంది పరిస్థితి. పట్టించుకోవటం అంటే కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు తెలంగాణ లో సచివాలయంలోకి కూడా రానివ్వని పరిస్థితి. ఏ పత్రిక రిపోర్టర్ అయినా..ఛానెళ్ల ప్రతినిదులు అయినా కచ్చితమైన సమాచారం తెలుసుకోవటానికి ఉన్న మార్గం ఎక్కడ?. ప్రభుత్వ తీరు చుసిన తర్వాత ఐఏఎస్ లు కూడా అదే లైన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మీడియా ఫోన్లు ఎత్తరు. ఇక నిరుద్యోగ యువత పరిస్థితి అయితే మరింత దారుణం. టిఎస్ పీఎస్ సి లో జరిగిన తంతు అందరూ చూస్తున్నదే. ఇలా చెప్పుకుంటే పోతే ఆ జాబితా చాంతాడు అంత అవుతుంది. ఎవరికైనా జీవిత లక్ష్యం అంటే ఒకటే ఉంటుంది...కానీ సీఎం కెసిఆర్ లక్ష్యాలు అలా మారుతూ పోతున్నాయి అంటే తెలంగాణ సెంటిమెంట్ ను కెసిఆర్ తన రాజకీయ అవసరాలకు ఎలా వాడుకున్నారనే విషయన్ని ప్రజలు ఇప్పటికైనా గమనిస్తే బాగుంటుంది అని ఒక తెలంగాణ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it