Telugu Gateway
Telugugateway Exclusives

అక్కడ మోడీ, కెసిఆర్, జగన్ లక్ష్యం ఒక్కటే!

అక్కడ మోడీ, కెసిఆర్, జగన్ లక్ష్యం ఒక్కటే!
X

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించటం కష్టం. ఎవరు ఎవరితో కలుస్తారు అనే విషయం కూడా పరిస్థితిని బట్టి మారుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులను తోక పార్టీలుగా విమర్శించినా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాత్రం ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కెసిఆర్, కమ్యూనిస్టుల మధ్య లెక్క తేడా వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రెండు పార్టీలు అడిగే సీట్లు ఇవ్వటానికి కూడా కెసిఆర్ సిద్ధంగా లేరు అని బిఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ తరుణం లో ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు ఆర్టికల్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావాలి....ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తుకు మొగ్గుచూపుతోంది. ఇప్పుడు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఒక భారీ ప్లాన్ తో పవన్ కళ్యాణ్ తో పొత్తుకు రెడీ అయ్యారన్నది కొత్తపలుకు సారాంశం. ఇలా చేయటం ద్వారా కెసిఆర్ రెండు ప్రయోజనాలు ఆశించినట్లు చెపుతున్నారు. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేసి జగన్ కు మరో సారి సాయం చేయటం, రెండవది తెలంగాణ లో కూడా పవన్ కళ్యాణ్ సామజిక వర్గంతో పాటు..అయన ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకుని రాజకీయంగా ప్రయోజనం పొందాలన్నది కెసిఆర్ ప్లాన్ గా చెపుతున్నారు.

దీనికి అయ్యే ఎన్నికల ఖర్చు అంతా తానే చూసుకుంటానని సంకేతాలు పంపించినట్లు కొత్తపలుకు మాట. అయితే ఇది జరిగే పని కాదు అనే అభిప్రాయంలో జనసేన నేతలు ఉన్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న టెంపర్మెంట్ కు ఏ రకంగానూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార వైసీపీ కి సహకరించే పరిస్థితి ఉండదు అన్నది ఆ పార్టీ నాయకుల వాదన. మరో వైపు బీజేపీ కూడా జనసేన టీడీపీ వైపు వెళ్లకుండా నిరోధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తాము, జనసేన మాత్రమే కలిసి ఎన్నికలకు వెళతామని పదే పదే ప్రకటిస్తూ వస్తుంది. అది జరిగే ఛాన్స్ లేక పోవటం తో ఇప్పుడు కెసిఆర్ జనసేన తో పొత్తుకు ఎంట్రీ ఇవ్వటం అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశగా మారింది. మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది తేలాలంటే ఇంకా చాలా సమయమే ఉంది. అయితే జనసేన వర్గాలు మాత్రం పొత్తుకు బిఆర్ఎస్ నుంచి సంకేతాలు అందిన మాట వాస్తవమే అని చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బిఆర్ఎస్ పోటీ చేస్తుంది అని ప్రకటించినా..ఏపీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రకటన అంతా ఒక వ్యూహం ప్రకారమే చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it