Telugu Gateway
Telugugateway Exclusives

బాటిళ్ళలో 'గాలి' అమ్ముతున్నారు

బాటిళ్ళలో గాలి అమ్ముతున్నారు
X

ఐడియానే పెట్టుబడి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు ఈ 'గాలి' ఐడియాతో వ్యాపారం మొదలుపెట్టింది ఓ సంస్థ. స్వచ్చమైన గాలిని బాటిళ్ళలో నింపి అమ్మకానికి పెట్టారు. అది కూడా మన భారతీయ కరెన్సీలో అయితే ఒక్కో బాటిల్ దర 2500 రూపాయలుగా నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఒక్కో చోట చిక్కుకుపోయారు. అంతే కాదు.. బ్రిటన్ లో వచ్చిన కొత్త వైరస్ మరింత కలకలం రేపుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ కు చెందిన వారు విదేశాల్లో చిక్కుకుపోయి..క్రిస్మస్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి, ఇతర కారణాలతో వేరే దేశాల్లో ఉన్న బ్రిటన్ వాసులకు ఇది సరఫరా చేస్తున్నారు. ఈ బాటిల్ లో గాలి పీల్చుకుని ఉపశమనం పొందవచ్చని చెబుతోంది సదరు సంస్థ.

ఈ పండగ సీజన్ లో విదేశాల్లో చిక్కుకుపోయి హోమ్ సిక్ లో ఉన్న బ్రిటన్ వాసులకు ఇది ఈ బాటిల్ గాలి ఎంతో ఊరటనిస్తోందని కంపెనీ పేర్కొంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ నుంచి ఈ బాటిళ్ళను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మై బ్యాగేజ్ అనే కంపెనీ ఈ బాటిళ్లను సరఫరా చేస్తోంది. ప్రతి బాటిల్ కు ఓ కార్క్ మూత ఉంటుంది. ఈ బాటిల్ ను కొనుగోలు చేసిన వారు ఓ సారి మూత ఓపెన్ చేసి..స్వచ్చమైన గాలి పీల్చుకుని వెంటనే మూత పెట్టి మళ్ళీ వాడుకోవచ్చని చెబుతోంది. సొంత దేశం నుంచి బాటిల్ లో వచ్చిన స్వచ్చమైన గాలి పీల్చటం ద్వారా హోమ్ సిక్ నెస్ పోతుందని పేర్కొంది. కొంత మంది పేరెంట్స్ తమ పిల్లల కోసం ఈ బాటిళ్ళను కొనుగోలు చేసి వాళ్లకు పంపినట్లు తెలిపారు. డెయిలీ మెయిల్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.

Next Story
Share it