Telugu Gateway
Telugugateway Exclusives

ఏపీలో పరిస్థితిపై బిజెపి సర్వే!

ఏపీలో పరిస్థితిపై బిజెపి సర్వే!
X

జనసేన-బిజెపి పొత్తు ఫలితం ఎలా ఉంటుంది?

కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తే..ఆ ప్రభావం ఎంత?

బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరుపైనా అంచనాకు నిర్ణయం

బిజెపి జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందా?. అసలు క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు రంగంలో దిగిందా?. అంతే కాదు..రాష్ట్రంలోని ప్రస్తుత నాయకత్వంపై కూడా ఓ అంచనాకు రావాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రస్తుత నాయకత్వ తీరుపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అందుకే ఒకేసారి పలు అంశాలపై స్పష్టత తెచ్చుకునేందుకు ఈ సర్వే చేయించుతోంది. ఇప్పటికే ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉంది. తాజాగా చిరంజీవి కూడా ఈ కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రజల్లో దీనిపై స్పందన ఎలా ఉందో తెలుసుకునేందు సర్వే టీమ్ లను రంగంలోకి దింపారు.

దీనికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత కేంద్ర నాయకత్వం ఏపీకి సంబంధించి ఓ ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఏపీలో బిజెపికి ప్రస్తుతం ఏ మాత్రం సానుకూల వాతావరణం లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబునాయుడు ఉన్నా...ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఏపీ విషయంలో ఆ పార్టీ వైఖరిలో పెద్దగ మార్పేమీ ఉండటం లేదు. రాజధాని అమరావతి విషయంలో కూడా ద్వంద వైఖరి అనుసరిస్తోంది. తొలుత రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది పార్టీ నిర్ణయం అని..తర్వాత ఏ ఒక్క రైతుకు నష్టం జరక్కుండా చూస్తామని మాట మార్చింది. మళ్ళీ తర్వాతే అమరావతే అంటూ పాట మొదలుపెట్టింది.

ఇక ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్, భారీ ఓడరేవు వంటి విభజన చట్టం హామీలను కూడా తుంగలో తొక్కారు. ఇప్పుడు మరో వైపు రైతు చట్టాలపై దేశ వ్యాప్తంగా బిజెపిపై వ్యతిరేకత పెరుగుతోంది. అంతే కాదు...పెట్రో ధరల పెంపు తోపాటు పలు అంశాలపై కేంద్రంలోని సర్కారుపై ముఖ్యంగా మధ్య తరగతి, యువతల్లో నిరాశా, నిస్పృహలు నెలకొన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రధాని అయిన తొలి రోజుల్లో ఉన్న అంచనాలు, నమ్మకం ఇప్పుడు పూర్తిగా సన్నగిల్లిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో బిజెపి ఏపీలో పుంజుకోవటం అనేది జరిగే పనేనా?.. అసలు సర్వే ఫలితాలు ఏమి వస్తాయి...వచ్చాక కేంద్ర నాయకత్వం ఏమి చేస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it