Telugu Gateway
Telugugateway Exclusives

టీఆర్ఎస్ పై వ్యతిరేకతే బిజెపి బలం!

టీఆర్ఎస్ పై వ్యతిరేకతే బిజెపి బలం!
X

తెలంగాణకు హైదరాబాద్ ఆక్సిజన్ వంటిది. అలాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి సడన్ గా ఎందుకు అధికార టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతోంది. అసలు బిజెపి వైపు నగర ప్రజలు ఆకర్షితులు అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా?. టీఆర్ఎస్ చెబుతున్నట్లు ఈ ఆరున్నర సంవత్సరాల పాలనలో బిజెపి హైదరాబాద్ కు ప్రత్యేకంగా చేసింది ఏమైనా ఉందా అంటే.. ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. కానీ మరి బిజెపి ఎందుకు కాంగ్రెస్ ను తోసిరాజని ముందుకు దూసుకొచ్చింది. అంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీపై పేరుకుపోయన అసంతృప్తే కారణం అని చెప్పకతప్పదు. పలు కీలక అంశాల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరు నగర వాసుల మనసుల నుంచి చెరిగిపోలేదు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్న మంత్రి కెటీఆర్ కొద్ది రోజుల క్రితం వరకూ సీఎం కెసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తాం..అసలు ఇది నడపటం సాధ్యం కాదు..సమ్మె చేసిన వారిని విధుల్లోకి తీసుకోం, రూట్లను ప్రైవేటీకరిస్తామని కార్మికులను ఏ సీఎం బెదిరించని రీతిలో బెదిరించారు.

సమ్మె విషయంలో కూడా సీఎం కెసీఆర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల అటు ఆర్టీసీ కార్మికులతోపాటు..నగర నగర ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇది ఒక అంశం అయితే కరోనా సమయంలో టెస్ట్ లు సరిగా చేయకపోవటం, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవటంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరో వైపు ఆరేళ్ల నుంచి పేదవాళ్లను ఊరిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి అయింది అతి తక్కువ. దీనికి సంబంధించిన సీఎం కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు ఎన్నో. కానీ వాస్తవంగా పూర్తి అయిన ఇళ్ళు నామమాత్రమే. ఇది పేదల్లో తీవ్ర అసంతృప్తికి కారణం అయింది. మంత్రి కెటీఆర్ ఘనంగా ప్రకటిస్తున్న బస్తీ దవాఖానాలు అన్నీ ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభించినవే. వర్షం వస్తే అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ ల ముందు నీళ్ళు నిలబడటం సమైక్య పాలకుల పాపమే అని విమర్శించిన కెసీఆర్ అసెంబ్లీ వేదికగా తాము ఏడాదిలో ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని ప్రకటించారు. కానీ ఆరున్నర సంవత్సరాలు గడిచినా ఇందులో ప్రగతి శూన్యం.

ఓ వైపు మంత్రి కెటీఆర్ అసెంబ్లీలో, బయటా జీహెచ్ఎంసీపై 67 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నా ఆ మేర ఎక్కడా పురోగతి కన్పించలేదనే చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రగతిలో టీఆర్ఎస్ పాత్ర చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒక్క విషయంలో మాత్రం టీఆర్ఎస్ పాత్రను మాత్రం విస్మరించలేం. ఈ ఆరున్నర సంవత్సరాల కాలంలో నగరంలో పెద్దగా ఘర్షణలకు ఛాన్స్ లేకుండా చేసిందనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎంఐఎంతో దోస్తీ చేస్తూ సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి అసలు ఆ పార్టీతో తమకు సంబంధం లేదని మాట్లాడటం విచిత్రం. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని స్వయంగా సీఎం కెసీఆర్ పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. కానీ అసలు తమ ప్రత్యర్ధి ఎంఐఎం పార్టీనే ప్రకటన అయితే చేస్తారు కానీ..అసలు అటువైపు ప్రచారానికి కూడా వెళ్ళరు. దీన్ని బట్టే అర్ధం అవుతుంది టీఆర్ఎస్ వైఖరి. వరదలు వస్తే కేంద్ర మంత్రులు రాలేదు..బిజెపి వాళ్ళు రాలేదని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు అసలు ప్రగతి భవన్ లోనే ఉన్న సీఎం కెసీఆర్ బయటక రాని విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు.

ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ తెలంగాణ బిజెపికి ఓ బ్రహ్మస్త్రంగా దొరికింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి నేతలు పదే పదే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. బిజెపి సహజంగానే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటుంది. బిజెపి, ఎంఐఎంలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ప్రకటిస్తున్న టీఆర్ఎస్ నేతలు తాజాగా సీఎం కెసీఆర్ ను మించిన అతి పెద్ద హిందువు ఎవరు అంటూ సొంత మీడియాలో పేజీలకు పేజీలు కథనాలు ప్రచురించుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో టీఆర్ఎస్ కూడా బిజెపి ట్రాప్ లో పడిందనే విమర్శలను మూటకట్టుకుంటోంది. దీనికి తోడు ప్రస్తుత టీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇవి కూడా టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారింది. దీంతోపాటు కొంత మంది అభ్యర్ధులకు ఎమ్మెల్యేల సహయ నిరాకరణ కూడా కీలకంగా మారనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో తొలిసారి టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. దీంతో వారు ఎప్పటి నుంచో సర్కారుపై ఉన్న కోపాన్ని ఈ సారి పక్కాగా ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొంత మంది అయితే అనధికారికంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్ల వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించనుంది. ఇవన్నీ బిజెపికి కలసి వచ్చే అంశాలుగా మారాయి.

Next Story
Share it