విజయసాయిరెడ్డికి 'బిగ్ షాక్'!
ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తొలగింపు.. ఈ నెలాఖరులోగా నిర్ణయం!
కొత్త ఇన్ ఛార్జి గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఛాన్స్
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సంపూర్ణ మార్పులతోపాటు పార్టీలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా?.అంటే ఔను అనే సంకేతాలు వస్తున్నాయి ఆ పార్టీ వర్గాల నుంచి. ఇందులో అత్యంత కీలకమైనది ఏమిటంటే ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిపై ఈ సారి వేటుపడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించునున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ అయితే ఆయన పేరే ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జికి పరిశీలనలో ఉంది. వైసీపీ సర్కారు విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించటంతో ఈ ప్రాంతానికి రాజకీయగా, ఆర్ధికంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల వరకూ అక్కడ అంతా విజయసాయిరెడ్డి హవానే నడిచింది. అయితే ఇటీవల జరిగిన అధికారుల మార్పులు కూడా ఆయనకు చెక్ పెట్టేదిశగానే సాగాయని వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు వెల్లడించారు. అంతే కాదు..ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలక సామాజికవర్గం నేతలు కూడా విజయసాయిరెడ్డి తీరుపై రగిలిపోతున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం వీరంతా సమావేశం కూడా పెట్టుకున్నారు. ఈ విషయం సీఎం జగన్ కు దృష్టికి కూడా వెళ్ళింది. అదే సమయంలో విజయసాయిరెడ్డిపై మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భూములకు సంబంధించిన అంశంలో. చివరకు విజయసాయిరెడ్డి కూడా తన పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే ఫిర్యాదులు చేయాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
గత కొంత కాలంగా కూడా ఆయన ముభావంగానే గడుపుతున్నారు. అంతే కాదు..కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన తనకు విశాఖలో సొంత ఇళ్ళు కూడా లేదని..హైదరాబాద్ లో కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు..తాను అవినీతికి అమడదూరంలో ఉన్నానంటూ వివరణ ఇచ్చుకున్నట్లు మాట్లాడారు. ఇవన్నీ కూడా తెరవెనక జరుగుతున్న పరిణామాలు తెలిశాక విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో జగన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డికి క్రమక్రమంగా పార్టీలో పట్టుతగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పార్టీపరంగా సజ్జల రామక్రిష్ణారెడ్డి అత్యంత కీలకంగా మారారు. దీంతో విజయసాయిరెడ్డి ఏదైనా కీలక సమావేశం ఉంటే తప్ప తాడేపల్లి వైపు చూడని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు దేశంలోని దిగ్గజ సంస్థకు చెందిన ప్రత్యేక విమానాలు నిత్యం ఉపయోగించటం, ఇవన్నీ జగన్ కూడా దృష్టికి పోవటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. దీంతోపాటు ఢిల్లీలో తాజాగా జరిగిన పరిణామాలు మరింత కీలకంగా మారినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. దసరా తర్వాత జరిగే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతోపాటు పార్టీలో ఈ కీలక మార్పులు ఉంటాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. మరి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత విజయసాయిరెడ్డి ఇక పూర్తిగా ఢిల్లీకే పరిమితం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.