ఈటెలకు 'రక్షణ' దొరికింది..కానీ లక్ష్యం నెరవేరుతుందా?!
టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ కు కావాల్సినంత టైమ్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ప్రయత్నించటానికి. ఈటెల రాజేందర్ పై చేసిన భూకబ్జా ఆరోపణలు..విచారణలు అన్నీ ప్రస్తుతానికి వెనక్కిపోయాయి. ఇప్పుడు ఫోకస్ అంతా ఓన్లీ హుజూరాబాద్ ఎన్నికలపైనే. మిగతా విషయాలన్నీ తర్వాతే. వెంటనే హుజూరాబాద్ ఎన్నికలు వస్తే కెసీఆర్ అణచివేశాడనే..అన్యాయం చేసాడనే ఈటెల రాజేందర్ కు కలిసొస్తుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అంతే కాకుండా సుదీర్ఘకాలం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించం కూడా కలిసొచ్చేది. వాస్తవానికి నిన్నమొన్నటివరకూ ఈటెల రాజేందర్ కు అనుకూల వాతావరణమే హూజూరాబాద్ లో ఉంది. కానీ ఎన్నిక ఎంత జాప్యం జరిగితే ఈటెల రాజేందర్ కు అంత నష్టం అన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కమ్మేసింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే 2000 కోట్ల రూపాయల దళిత బంధు అనే అస్త్రాన్ని ప్రయోగించింది. మధ్యలో ఇంకా కొత్తగా ఎన్ని వస్తాయో. దేశంలో ప్రధాని మోడీకి రాజకీయంగా సవాల్ విసురుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లైన్ క్లియర్ చేసేలా పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం మరొకటి ఉంది. విమర్శలు ఎన్ని వచ్చినా తెలంగాణలో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్న రోజుల్లోనే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపారు.
దీనిపై హైకోర్టు కూడా అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. కానీ ప్రస్తుతం సర్కారీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసులు రోజుకు మూడు వందలు మాత్రమే. పండగల తర్వాత కేసులు పెరుగుతాయనే సంకేతాలు ఉన్నాయి. కానీ తక్కువ ఉన్నప్పుడు వద్దని...పండగల తర్వాత ఎన్నికలకు తెలంగాణ సర్కారు సన్నద్దం అవ్వటం ఆశ్చర్యకరంగా మారింది. ఈసీ స్వయంప్రతిపత్తి గల సంస్థ. రాష్ట్రం ఏ అభిప్రాయం చెప్పినా వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి హుజూరాబాద్ లో బిజెపికి అనుకూల వాతావరణం ఉంది. మరి గెలిచే సీటుకు వెంటనే ఎన్నికలు జరిగేలా చూసుకోవాల్సిన బిజెపి ఎందుకు ఆ పని వదిలేసినట్లు?. పైకి ఈసీ స్వయంప్రతిపత్తి గల సంస్థ అయినా పలుమార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో.
ఏపీలో కరోనా కేసులు కాస్త ఎక్కువ ఉన్నా..తెలంగాణలో మాత్రం ప్రభుత్వ లెక్కల ప్రకారం చాలా తక్కువే ఉన్నట్లు. తాజా కెసీఆర్ ఢిల్లీ టూర్, ఈసీ ఎన్నికల నిర్ణయాలు అన్నీ రాజకీయ కోణంలో విశ్లేషిస్తే తెరవెనక ఏదో జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపిలో చేరటం వల్ల మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కెసీఆర్ నుంచి ఎదురయ్యే కేసుల సవాళ్ళ నుంచి 'రక్షణ' అయితే తాత్కాలికంగా దొరికినట్లు కన్పిస్తోంది కానీ...మరి రాజకీయ లక్ష్యం నెరవేరుతుందా?.
పార్టీలో ఎంత పెద్ద నేత అయినా టీఆర్ఎస్ లో ఉంటేనే హీరో లేకపోతే జీరో అని ప్రూవ్ చేయాలనే కెసీఆర్ ప్రయత్నం ఫలిస్తుందా?. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలలో జాప్యం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో టీఆర్ఎస్, బిజెపి ఒక్కటే అని విమర్శలు గుప్పిస్తోంది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ అయితే తాజాగా కెసీఆర్ ఢిల్లీ టూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి సీఎం కెసీఆర్ నమస్కారం చేసిన తీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం నవాబు ఒంగి నమస్కారం పెట్టినట్లు ఉందన్నారు.