2500 కోట్ల రూపాయల స్కామ్ పై కెసీఆర్..కెటీఆర్ మౌనం ఎందుకో?!
ఇది ప్రభుత్వ భూమి అయితే..ప్రైవేట్ పట్టా ల్యాండ్ గా ప్రకటించారు. ఈ భూమి జూబ్లిహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు ఆనుకుని మరీ ఉంటుంది. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ భూమి తమ చేతికి రాక ముందే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సంపన్నులకు గజం 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల మేర విక్రయించి సొమ్ము చేసుకుంది. వాస్తవానికి ఇది పక్కాగా ప్రభుత్వ భూమి అయితే దీన్ని ప్రైవేట్ పట్టా భూమిగా ప్రకటించటమే కాకుండా..రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించారు. దీనికి సంబంధించిన సమగ్ర కథనాన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కిక్కురుమనకపోవటం కూడా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వార్తను ట్యాగ్ చేస్తూ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి అంటూ ఓ పోస్టు పెట్టి వదిలేసింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బిజెపి మాత్రం దీనిపై ఎక్కడా నోరెత్తిన దాఖలాలు లేవు. ఇదొక్కటే కాదు..నగరరంలోని కీలక ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్లో భారీ డీల్స్ జరుగుతున్నాయని..అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా పలు సంస్థలపై జరిగిన ఐటి దాడుల్లో ఈ భూ దందాలు అనేకం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.