Telugu Gateway
Telugugateway Exclusives

అర‌వై కోట్ల‌లో 28.54 కోట్లు కొట్టేశారు!

అర‌వై కోట్ల‌లో 28.54 కోట్లు కొట్టేశారు!
X

జూబ్లిహిల్స్ గ‌త క‌మిటీ బిగ్ స్కామ్

స‌భ్యుల‌కు వివ‌రాలు పంపిన కొత్త క‌మిటీ

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్ర‌మాల్లో ఇది ఓ కొత్త కోణం. క్ల‌బ్ కు చెందిన స్థ‌లంలో ఓ భారీ నిర్మాణం చేప‌ట్టారు. దీనికి 60 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అయింద‌ని లెక్క‌ల్లో రాశారు. కానీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కొత్త క‌మిటీ ప్ర‌భుత్వ ఆమోదిత విలువ మ‌దింపుదారుతో లెక్క‌లు వేయించారు. అయితే అక్క‌డ నిర్మాణాలు ప‌రిశీలించిన వాల్యూయ‌ర్ ఈ భ‌వ‌నాల విలువ 31.54 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఉంటుంద‌ని లెక్క గ‌ట్టారు. అంటే గ‌త క‌మిటీ లో ప్రెసిడెంట్ గా ఉన్న తుమ్మ‌ల న‌రేంద్ర‌చౌద‌రి, అప్ప‌టి కార్య‌ద‌ర్శి టి. హ‌నుమంత‌రావులతో పాటు గ‌త క‌మిటీనే ఈ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు నిర్ధారించారు. స‌ద‌రు నిర్మాణానికి సంబంధించి సిద్ధం చేసిన ప్రాజెక్టు నివేదిక‌లో కొత్త‌గా చేప‌ట్టిన నిర్మాణాల్లో అద్దెకు చ‌ద‌ర‌పు అడుగుకు 65 నుంచి 75 రూపాయ‌లు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. కానీ నిర్మాణాలు పూర్తి అయిన త‌ర్వాత లీజు ఒప్పందాల్లో మాత్రం చ‌ద‌ర‌పు అడుగుకు 35 రూపాయ‌లు, మ‌రో మూడు రూపాయ‌లు ప్రాప‌ర్టీ ట్యాక్స్ కింద ఒప్పందం చేసుకున్నారు. మ‌రి బ్యాంకు రుణాల‌కు స‌మ‌ర్పించిన నివేదిక‌ల్లో 65 నుంచి 75 రూపాయ‌ల ధ‌ర చూపించి లీజుకు అంత త‌క్కువ ధ‌ర‌కు ఎందుకు ఇచ్చారు. అంటే ఇక్క‌డా భారీ గోల్ మాల్ జ‌రిగిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. మ‌రో విచిత్రం ఏమింటే ఈ నిర్మాణాలు చేప‌ట్టేందుకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల‌పై చెల్లించాల్సిన ఈఎంఐ 42 ల‌క్షల రూపాయ‌లు అయితే..2.23 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల లీజుకు జూబ్లిహిల్స్ వంటి ప్రాంతంలో సొసైటీకి వ‌చ్చేది 25.84 ల‌క్షల రూపాయ‌ల అంట‌. అంటే సొసైటీ రుణానికి ఎదురు చెల్లించాల‌న్న‌మాట‌. ఈ నిర్మాణం మొత్తం 2.23 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉంటే కేవ‌లం 68 వేల చ‌ద‌ర‌పు అడుగులు మాత్ర‌మే లీజుకు ఇచ్చిన‌ట్లు చూపించారు. పార్కింగ్, కామ‌న్ ఏరియాగా ఉన్న 1.55 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల‌కు మాత్రం ఎలాంటి లీజు వేయ‌కుండా వదిలేశారు. దీంతో పాటు అద్దెకు ఇచ్చిన ప్రాంతంలో 2.16 ఎక‌రాల ఖాళీ స్థ‌లం ఉంది. దీన్ని కూడా అలాగే వ‌దిలేశారు.

ఈ ఒక్క డీల్ లోనే కోట్లాది రూపాయ‌ల మేర సొసైటీకి న‌ష్టం చేశార‌ని కొత్త కమిటీ స‌భ్యుల‌కు పంపిన నివేదిక‌లో పేర్కొంది. నిర్మాణాల్లో 28 కోట్ల రూపాయ‌ల మేర అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టమే కాకుండా...లీజు ద్వారా కూడా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ ఒక్క డీల్ లోనే ఏకంగా దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయ‌ల‌పైనే ఫ్రాడ్ జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌త క‌మిటీ చేసిన అక్ర‌మాల‌ను కొత్త క‌మిటీ స‌భ్యుల‌కు స‌వివరంగా తెలుపుతూ నివేదిక‌లు అంద‌జేసింది. ఇప్ప‌టికే ఓ ప్లాట్ వివాదంపై గ‌త క‌మిటీపై నూత‌న పాల‌క‌వ‌ర్గం కేసు పెట్టింది కూడా. కొత్త క‌మిటీ వ‌చ్చి అక్ర‌మాల‌ను వెలుగులోకి తెస్తుంద‌నే ఉద్దేశంతోనే వీరు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌న‌ప్ప‌టి నుంచి పాత క‌మిటీ తెర‌వెన‌క నుంచి ప‌లు ఇబ్బందులు క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ క‌మిటీ త‌ర‌పున ఎన్నికైన కార్య‌ద‌ర్శి ముర‌ళీముకుంద్ తోపాటు కొం త‌మంది స‌భ్యుల‌ను త‌మ వైపు తిప్పుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వివాదాలు రేపుతూ పనులు ముందుకు సాగ‌కుండా చేస్తోంది. కొత్త క‌మిటీకి ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌య‌వంతంగా రికార్డులు వెళ్ల‌కుండా చేయ‌టంలో ప్ర‌త్య‌ర్ధులు విజ‌యం సాధించారనే చెప్పొచ్చు. ట్రిబ్యున‌ల్ లో గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే త‌ప్ప‌..కొత్త క‌మిటీకి ఫైళ్ళు అందవు. ఫైళ్ళు పూర్తిగా కొత్త క‌మిటీ చేతికి వ‌స్తే అప్పుడు ఇంకా ఎన్ని అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it