Telugu Gateway
Telugugateway Exclusives

బ్యాంకులను ముంచి....వేల ఎకరాల భూ దందా

బ్యాంకులను ముంచి....వేల ఎకరాల భూ దందా
X

చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలు చేజిక్కుంచుకునే ప్లాన్

రెవెన్యూ అధికారులు సహకారం!

ఓ మంత్రికీ భారీ ముడుపులు?!

పలు జిల్లాల్లో ఇదే తరహా లావాదేవీలు!

ఆయన వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు టోపీ పెట్టారు. తాజాగా సీబీఐ కేసు కూడా నమోదు అయింది ఆయనపై. ఆ పారిశ్రామికవేత్త ఓ మీడియా అధిపతికి అత్యంత సన్నిహిత బంధువు కూడా. బ్యాంకులు అయిపోయాయి...ఇప్పుడు భూములు చుట్టూ తిరుగుతోంది వ్యవహారం. ఈ పారిశ్రామికవేత్త అక్రమ భూ లావాదేవీల వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా మామూలుగా లేదు. ఏకంగా వేల ఎకరాల్లో ఈ దందా సాగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది ఏపీలో పలు జిల్లాలకు వ్యాపించి ఉంది. అయితే ఎక్కడా కూడా తన పేరు వెలుగులోకి రాకుండా ఉండేందుకు మెజారిటీ లావాదేవీలు మాత్రం బినామీల ద్వారానే నడిపిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎక్కువ శాతం వివాదాల్లో ఉన్న భూములను కైవసం చేసుకుని వాటిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందుకు ఓ మంత్రితోపాటు పలువురు అధికారులకు కోట్లాది రూపాయలు అందజేసినట్లు రెవెన్యూ శాఖ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దేశంలోనే విజయవంతం అయితన బహుళ ఉత్పత్తుల ఆర్ధిక మండలి ఉన్న చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ సమీపంలో కూడా ఆయన వేల ఎకరాలకు టెండర్ పెట్టారు. ఏకంగా 1200 ఎకరాల ఇనామ్ భూములను కైవసం చేసుకునే పని జోరుగా సాగుతోందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. దీని కోసం రెవెన్యూ శాఖలోని కీలక అధికారుల సాయం కూడా తీసుకుంటున్నారు. ఎవరికి అందాల్సినవి వారికి అందుతున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రెవన్యూ శాఖలోని కీలక అధికారితో ఈ భూముల క్రమబద్దీకరణ ప్రతిపాదనను తిరస్కరింపచేసుకున్నారు. వీరి ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా కోర్టు సూచిస్తే...ఇప్పుడు ఈ సాకును అడ్డం పెట్టుకుని బడా పారిశ్రామికవేత్తకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ భూమి అంతా శ్రీసిటికి సమీపంలోని పదిరి కుప్పం గ్రామంలో ఉందని తెలిపారు. రెండు సర్వే నెంబర్లలో 870 ఎకరాల భూమి ఉండగా, ఇతర సర్వే నెంబర్లలో 330 ఎకరాలు ఉంది. ఈ పారిశ్రామికవేత్తకు సంబంధించిన భూ సెటిల్ మెంట్స్, వ్యవహారాలు అన్నీ వి. నాయుడు అనే వ్యక్తి చూస్తున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. అధికారులు ఈ అక్రమాలను అడ్డుకుంటారో లేక...బ్యాంకులను ముంచిన పారిశ్రామికవేత్త ఇచ్చిన డబ్బుతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో ఈ పారిశ్రామికవేత్త బినామీలతో పెద్ద ఎత్తున ల్యాండ్ సేకరించినట్లు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it