Telugu Gateway
Telugugateway Exclusives

భారతి సిమెంట్స్ కే ఏపీ సర్కారు బల్క్ ఆర్డర్లు

భారతి సిమెంట్స్ కే ఏపీ సర్కారు బల్క్ ఆర్డర్లు
X

పది నెలల్లోనే 2.28 లక్షల టన్నుల కొనుగోళ్ళు

తర్వాత వాటా ఇండియా సిమెంట్స్ దే

ఏపీ సర్కారు కేవలం ఎంపిక చేసిన మూడు సిమెంట్ కంపెనీలకే ప్రభుత్వం తరపు నుంచి సిమెంట్ ఆర్డర్లు ఇస్తుందా?. పది నెలల కాలంలో మూడు కంపెనీలు అంటే ఒకటి భారతి సిమెంట్స్, రెండవది ఇండియా సిమెంట్స్, మూడవది పెన్నా సిమెంట్స్ కు పెద్ద ఎత్తున సిమెంట్ ఆర్డర్లు పెట్టిందా?. అంటే ఔనని చెబుతోంది ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం. భారతి సిమెంట్స్ లో 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికెట్ కు విక్రయించగా..మిగిలిన 49 శాతం వాటా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులదే. దీంతో ఈ వ్యవహరం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సిమెంట్ ఆర్డర్లకు సంబంధించి 'ద ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి 18 వరకూ ఏపీ ప్రభుత్వం భారతి సిమెంట్స్ కు ఏకంగా 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంట్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. మరో కంపెనీ ఇండియా సిమెంట్స్ ఏపీ ప్రభుత్వం నుంచి ఆర్డర్లు పొందిన రెండవ అతి పెద్ద కంపెనీగా ఉంది. ఈ సంస్థకు 1,59, 753 మెట్రిక్ టన్నుల ఆర్డర్డు దక్కాయి. ఇదే ఇండియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్ లో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.

మరో కంపెనీ పెన్నా సిమెంట్స్ కు 1,50,325 మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరా ఆర్డర్ దక్కించుకుంది. ఏపీలో సిమెంట్ ఆర్డర్లు అన్నీ ఈ మూడు కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ స్టోరీ రాసిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ శ్రీనివాస్ జన్యాల ఏపీ ప్రభుత్వం భారతి, ఇండియా సిమెంట్స్ సంస్థలకే బల్క్ సిమెంట్ ఆర్డర్లు ఇచ్చిన అంశంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరణ తీసుకోగా..ఆయా సంస్థలు ప్రభుత్వ షెడ్యూల్స్ ప్రకారం సరఫరా చేయటానికి అవి ముందుకు వచ్చాయని, ఇతర సంస్థలకు సప్లయ్ చైన్ సమస్యలు ఉన్నాయని.నిర్దేశిత సమయం సమయం ప్రకారం సిమెంట్ సరఫరా ఎంతో ముఖ్యం అని తెలిపారు.

ఏపీ సర్కారు కు చెందిన హౌసింగ్, రహదారులు, సాగునీటి శాఖ వంటివి వైఎస్ఆర్ నిర్మాణ్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు ఆర్డర్లు పెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం 50 కేజీల బ్యాగ్ ధరను 225 రూపాయలుగా నిర్ణయించింది. ఇదే అంశంపై భారతి సిమెంట్స్ డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ మ్యానుఫ్చాక్చరర్స్ అసోసియేషన్ (ఏపీసీఎంఏ) వైస్ ప్రెసిడెంట్ అయిన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తమకు అనుకూలంగా ఆర్డర్లు ఇస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆర్డర్లతో వైఎస్ భారతికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా తాము బ్యాగ్ 230 రూపాయలకు సరఫరా చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు అన్నీ కార్టెల్ గా ఏర్పడి ధరలను అడ్డగోలుగా పెంచారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

భారతి సిమెంట్స్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన కావటం ఒకెత్తు అయితే..ఇండియా సిమెంట్స్ తో కూడా జగన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.. అంతే కాదు సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ కూడా నిందితుడుగా ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి ఉండగా సొంత కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని ఆరోపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అదే పని చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఏపీలో భారతి, ఇండియా సిమెంట్స్ కాకుండా పలు అగ్రశ్రేణి సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని కాదని ఎక్కువ ఆర్డర్లు ఈ సంస్థలకే ఇస్తుండటంతో ప్రభుత్వం వీటి పట్ల అనుకూలంగా వ్యవహరిస్తుందనే విషయం అర్ధం అవుతుంది.

Next Story
Share it