సంక్షేమమా..రాజకీయ నేతల క్షేమమా?
సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అంతే కానీ అధికారంలో ఉన్న పార్టీలు, నేతల ప్రయోజనాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన జరగకూడదు. కానీ గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూస్తుంటే ఇది ప్రజా ప్రయోజనాల కోణం కంటే సొంత రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చేస్తున్నారని అభిప్రాయం కలగక మానదు. ఓ వైపు మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయకుండానే తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను తెరపైకి తెస్తున్నారు నేతలు. ఎంపిక చేసిన వర్గాలపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చేసే సంక్షేమం అనేది అవసరంలో ఉన్న ప్రజలను ఆదుకనేలా ఉండాలి తప్ప...రాజకీయ నాయకులు పార్టీల 'క్షేమం' కోసం కాకూడదు.
కానీ తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం దారితప్పుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులు సంక్షేమం పేరుతో పూర్తిగా తమ పార్టీల క్షేమం చూసుకుంటున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా..ఎన్నికల్లో తమ గెలుపు కోసమే వీటిని తెరపైకి తెస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు..ఏమి చేసినా కరెక్టే అన్న వాదన ముందుకు తెస్తున్నారు. నిజంగా అధికార పార్టీలకు ప్రజలపై అంత ప్రేమ ఉంటే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హమీలను అమలు చేయవచ్చు కదా. కానీ అలా చేయకుండా ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ..పాత వాటిని మాత్రం పక్కడ పడేస్తున్నారు.
ఎప్పుడు ఏది అవసరమో..ఆ వర్గాన్ని టార్గెట్ చేసుకుని పథకాల రూపకల్పన చేస్తున్నారు. పోనీ ఈ నేతలు ఏమైనా తమ వినూత్న పరిపాలనా విధానాలు, అద్బుత ఆవిష్కరణల ద్వారా ఏమైనా రాష్ట్ర ఆదాయం పెంచి ఈ పథకాలు అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. భవిష్యత్ తరాలకు...భవిష్యత్ అవసరాలకు ఉంచాల్సిన భూములను కూడా ఎక్కడకు అక్కడ తెగనమ్మి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆ నిధులు వాడేస్తున్నారు. పైగా దేశంలో తమ అంత అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది ఎవరైనా ఉన్నారా అంటూ సవాళ్లు విసురుతున్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును తమ రాజకీయ ప్రయోజనాల కోణంలో పథకాలకు రూపకల్పన చేసి దేశంలో తామే సంక్షేమ కార్యక్రమాలకు ఛాంపియన్లుగా చెప్పుకుంటున్నారు.