ఏపీ, తెలంగాణ వ్యాక్సిన్ 'గ్లోబల్ టెండర్ల' కథ కంచికేనా!
ఫైజర్..మోడెర్నాల ప్రకటనతో కథ మళ్ళీ మొదటికే
రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయం అంటున్న వ్యాక్సిన్ తయారీ సంస్థలు
స్పుత్నిక్ వి ఒక్కటే రాష్ట్రాల అవసరాలు తీర్చగలదా?
దేశంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్లు సరఫరా చేయటంలో కేంద్రం చేతులెత్తేసింది. అసలు వ్యాక్సిన్ల లభ్యత చూసుకోకుండానే 18 సంవత్సరాల వారికి కూడా వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చింది. అయితే దేశీయంగా తయారు అయ్యే వ్యాక్సిన్లలో సగం మాత్రమే తాము కొనుగోలు చేస్తామని.. మిగిలిన మొత్తం రాష్ట్రాలు..ప్రైవేట్ ఆస్పత్రులు కొనుక్కోవచ్చని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకాలను కూడా కేంద్రమే నియంత్రిస్తోంది. అయితే ఏపీతో పాటు తెలంగాణ సర్కార్లు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాయి. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వి తదితర వ్యాక్సిన్లు మాత్రమే. భారత్ లోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ తయారు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అయితే ఫైజర్, మోడెర్నా సంస్థలు మాత్రం తాము నేరుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయబోమని..ఏదైనా ఉంటే కేంద్రంతో మాత్రమే డీల్ చేస్తామని తేల్చిచెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ కూడా అందుకు బిన్నంగా వ్యవహరించే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్ లో ఈ వ్యాక్సిన్ తయారీకి మాత్రం ప్రయత్నాలు సాగుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను దేశంలోని ప్రముఖ దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ సరఫరా చేస్తోంది. అంతే కాదు త్వరలోనే దేశీయంగా కూడా ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నారు. సో... ఈ లెక్కన చూస్తే ఒక్క స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మాత్రమే కాస్తో కూస్తో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఛాన్స్ ఉంటే డాక్టర్ రెడ్డీస్ సంస్థే దిగుమతి చేసుకుని సరఫరా చేస్తుంది కదా?. ఈ లెక్కన చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందనకు ఏ మాత్రం ఛాన్స్ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్రం 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వటంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్ లు తామే ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని..ఆ భారం మొత్తం తామే భరిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకు అంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియే ఆగిపోయింది. ఏపీలో మళ్ళీ సోమవారం నుంచి ప్రారంభం అయింది. తాజా పరిణామాలు చూస్తుంటే గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు సేకరించటం అంత తేలిగ్గా జరిగే పనికాదని..కేంద్రమే రంగంలోకి దిగి ఓ ప్రణాళిక సిద్ధం చేసే వరకూ ఈ గందరగోళ వ్యవహారం అలాగే కొనసాగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.