Telugu Gateway
Telugugateway Exclusives

మొన్న ఫోన్లు బంద్ ..నేడు పేపర్స్ బంద్ !

మొన్న ఫోన్లు బంద్ ..నేడు పేపర్స్ బంద్ !
X

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది

అధికారుల విస్మయం

కీలక సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోని సమాచార శాఖ అధికారుల ఫోన్లు అన్ని బంద్ అయ్యాయి. అది సరిగ్గా జడ్పీటీసీ , ఎంపీటీసీ ఫలితాలు వెల్లడైన రోజు కావటంతో మీడియా ప్రతినిథులు సమాచార సేకరణకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇది మర్చి పోకముందే బుధవారం నాడు రాష్ట్ర పాలనకు కీలక కేంద్రం గా ఉండే సచివాలయానికి అసలు వార్తా పత్రికలు రాలేదు.ఈ అంశమే సచివాలయంలో పెద్ద చర్చనీయంశంగా మారింది. బిల్స్ కట్టనందుకే సర్వీస్ ప్రొవైడర్స్ ఫోన్స్ కట్ చేశారు. ఇప్పుడు పేపర్స్ ఆగిపోవటం వెనక కూడా ఇదే కారణం గా చెపుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు సమాచార శాఖ, ఇతర అధికారుల పేషీలకు కూడా ఇవ్వాళ పేపర్స్ రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది సచివాలయ ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తాయని వారు అంటున్నారు . ఒక ప్రభుత్వం ఫోన్ బిల్స్ , పేపర్ బిల్స్ కట్టలేక పోవటం అనేది గతం లో ఎప్పుడూ లేదంటున్నారు .

ప్రభుత్వానికి ఆర్ధిక కష్టాలు అనేది సాధారణమే అయినా మరీ ఇంత దారుణ పరిస్థితి ఇదే మొదటి సారి అని అంటున్నారు. గత కొంత కాలంగా చిన్న చిన్న బిల్స్ కూడా చెల్లంచకుండా జాప్యం చేస్తున్నారు. ఒక దశలో ముఖ్య మంత్రి క్యాంపు ఆఫీసుకి స్నాక్స్ సరఫరా చేసే వాళ్ళు కూడా తాము సేవలు ఆపేస్తామని చెప్పటంతో అప్పటికప్పుడు ఇదో సర్దుబాటు చేసారు. ఇప్పడు మొత్తం సచివాలయానికి పేపర్స్ ఆగిపోయాయి అని అధికారులు చెప్తున్నారు. ఒక వైపు సంక్షేమ కార్యక్రమాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతూ కూడా ఇలా ఫోన్ బిల్స్ , పేపర్ బిల్స్ ఆపటం..అవి కాస్త బయటకు వచ్చి ప్రభుత్వ పరువు పోవటమే ఏమిటో అర్ధం కావటం లేదు అని ఒక అధికారి వ్యాఖ్యనించారు. మీడియా వర్గాల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశగా మారింది.

Next Story
Share it