సమీర్ శర్మ....'రంగుల ట్రెండ్ ' ఫాలో అవుతున్నారా?!
ట్రెండ్ ప్రకారం వెళ్ళేవారే మార్కెట్లో నిలుస్తారు. అది వ్యాపారం అయినా..రాజకీయం అయినా..ఐఏఎస్ లు అయినా. ఏపీ కొత్త సీఎస్ సమీర్ శర్మ ఆ సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు ఉంది. బాధ్యతలు చేపట్టడానికి ఇరవై రోజుల ముందే ఆయన నియామకానికి సంబంధించిన జీవో వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది రొటీన్ గా జరిగే వ్యవహరమే. అయితే సీఎం జగన్ కు కొత్తగా సీఎస్ బాధ్యతలు చేపట్టనున్న సీఎస్ సమీర్ శర్మి ఇచ్చిన బొకే వ్యవహరం ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ కు ఇచ్చిన బొకే కు పైన చుట్టిన ర్యాపర్స్ కు వైసీపీ రంగులు వచ్చేలా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ జెండా రంగులో పూలు ఉండవు కాబట్టి కనీసం ర్యాపర్స్ విషయంలో అయినా ఆయన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉన్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
వైసీపీ అధికారం లోకి వచ్చాక ప్రభుత్వ భవనాలతోపాటు చాలా వాటికి పార్టీ జెండా రంగులతో నింపేయటం వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయినా సరే ఇప్పటికీ చాలా చోట్ల ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. కొత్త సీఎస్ సమీర్ శర్మ మరింత ముందు జాగ్రత్త చర్యగా బొకే ర్యాపర్స్ విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉందని ఐఏఎస్ లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దెబ్బకు ఆయనకు ఆరు నెలల ఎక్స్ టెన్షన్ గ్యారంటీ పక్కా అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది. సహజంగా సీఎంను కలసిన విఐపిలు ఇచ్చే బొకేలను భద్రతా సిబ్బందో లేక. .సీఎం వ్యక్తిగత సిబ్బందో తీసుకుని వాటిని పక్కన పెట్టేస్తారు. విచిత్రం ఏమిటంటే సీఎం జగన్ తనకు బాధ్యతలు చేపట్టాల్సిన సీఎస్ సమీర్ శర్మ ఇచ్చిన బొకేను తిరిగి ఆయన చేతికే ఇవ్వటం వీడియోలో స్పష్టం కన్పిస్తుంది.