Telugu Gateway
Telugugateway Exclusives

బొత్సాకు జ‌గ‌న్ ఝ‌ల‌క్!

బొత్సాకు జ‌గ‌న్ ఝ‌ల‌క్!
X

జూనియ‌ర్ల‌కు కీల‌క శాఖ‌లు..బొత్సా ఒక్క‌రికే డిమోష‌న్ అని చ‌ర్చ‌

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శాఖ‌ల కేటాయింపులో సీనియ‌ర్ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌కు ఝ‌ల‌క్ ఇచ్చారా?. అంటే అవునంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ఇటీవ‌ల వ‌ర‌కూ ఆయ‌న నిర్వ‌హించిన మున్సిప‌ల్ శాఖ‌ను ఆదిమూల‌పు సురేష్ కు కేటాయించి..ఆయ‌న చూసిన విద్యా శాఖ‌ను బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. బొత్సా స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే కాకుండా ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌నేత‌గా ఉన్నారు. అయినా శాఖ‌ల కేటాయింపులో ఆయ‌న ప్రాధాన్య‌త త‌గ్గించారు. మ‌రో సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్రికి మాత్రం ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండా అత్యంత కీల‌క‌మైన విద్యుత్ శాఖ‌తోపాటు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర‌, సాంకేతిక‌, గ‌నుల శాఖ‌ను కూడా అప్ప‌గించారు. బుగ్గ‌న త‌న ఆర్ధిక శాఖ‌నే తిరిగి పొంద‌గా...మ‌రో సీనియ‌ర్్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్ శాఖ కేటాయించారు. తొలిసారి మంత్రివ‌ర్గంలోచోటు ద‌క్కిన విడ‌ద‌ల ర‌జ‌నీకి అత్యంత కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ‌, గుడివాడ అమ‌ర్ నాధ్ కు ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక‌స‌దుపాయాలు, పెట్టుబ‌డుల‌తోపాటు ఐటి శాఖ‌ను కేటాయించారు. అంబ‌టి రాంబాబుకు జ‌ల‌వ‌న‌రుల శాఖ ఇచ్చారు.

ఓవ‌రాల్ గా చూస్తే తాజాగా జ‌రిగిన పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో డిమోష‌న్ పొందిన ఏకైక వ్య‌క్తి బొత్సా స‌త్య‌నారాయ‌ణే అన్న చ‌ర్చ సాగుతోంది. దీని వెన‌క కార‌ణాలు ఏమై ఉంటాయా అన్న అంశంపై కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే గ‌త మూడు సంవ‌త్స‌రాల సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను ప‌రిశీలిస్తే కీల‌క నిర్ణ‌యాలు అన్నీ సీఎం స్థాయిలో వెలువ‌డ‌తాయ‌ని అధికార వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గ‌తంలో మంత్రులు స్వ‌యంగా స‌మీక్షలు తుది నిర్ణ‌యాల స‌మ‌యంలో సీఎంతో భేటీ అయ్యేవార‌ని..కానీ ఇప్పుడు రివ‌ర్స్ లో న‌డుస్తోంద‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు. . ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని..కాక‌పోతే జ‌గ‌న్ హ‌యాంలో ఇది మ‌రింత కేంద్రీకృతం అయింద‌ని ఓ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు జూనియ‌ర్ల‌కు కీల‌క శాఖ‌లు అప్ప‌గించ‌టం వెన‌క కూడా ఇదే కార‌ణం అని చెబుతున్నారు.

Next Story
Share it