ఇసుక అమ్మలేక చేతులెత్తేసి..ఇప్పుడు సినిమా టిక్కెట్లు అమ్ముతుందట?
ఏపీ సర్కారు వింత వైఖరి
ఏపీ సర్కారు ఇసుక విక్రయంలో వేసిన పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోనే అత్యుత్తమ విధానం. ఇక అసలు ఎవరికి అన్యాయం జరగదు. అంతా పారదర్శకం అంటూ పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి మరీ ఊదరగొట్టింది. అంతే కాదు ఇసుక సరఫరా వాహనాలకు జీపీఎస్ కూడా పెడుతున్నామని..పక్కదారి పట్టే ఛాన్సే లేదంటూ నమ్మబలికింది. దీని కోసం చాలా రోజుల పాటు ఏకంగా ఇసుక సరఫరా కూడా ఆపేసింది. చివరకు అంతా తూచ్ అనేసి..ప్రైవేట్ కు అప్పగించి చేతులు దులుపుకుంది. అత్యుత్తమ విధానం అన్నది కాస్త పోయి ప్రైవేట్ లో అయితేనే అంతా బాగుంటుంది అని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఏపీ సర్కారు తనకు సంబంధం లేని సినిమా టిక్కెట్ల అమ్మకం రంగంలోకి దిగుతోదిం. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇలా ప్రభుత్వం సినిమా టిక్కెట్లు విక్రయించిన దాఖలాలు ఉన్నట్లు లేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 31న జీవో జారీ చేసింది.ఇది బుదవారం నాడు వెలుగులోకి వచ్చింది. ఏపీలోని సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి ప్రభుత్వమే ఓ పోర్టల్ ను డెవలప్ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు..
రైల్వే ఆన్ లైన్ ట్రాకింగ్ సిస్టమ్ తరహాలోనే సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి పోర్టల్ ను డెవలప్ చేయాలని నిర్ణయించారు. రైల్వే ఆన్ లైన్ టిక్కెట్లు అంటే అది రైల్వే శాఖ సొంత పోర్టల్. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం అది అందుకు పూర్తి భిన్నం. ఇది పూర్తిగా ప్రైవేట్ థియేటర్లు, మల్టీఫ్లెక్స్ ల వ్యవహారం. అసలు ఈ టిక్కెట్ల విక్రయం వెనక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ టిక్కెట్ల విక్రయ వ్యాపారంలోకి నేరుగా సర్కారు రంగంలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. ఈ టిక్కెట్ల విక్రయ పోర్టల్ ను ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చూసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన బ్లూప్రింట్, అమలు వ్యవహరాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు..ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి సహ ఛైర్మన్ గా, సమాచార శాఖ కార్యదర్శి, వాణజ్య శాఖ ప్రతినిధి, ఏపీటీఏస్ మేనేజింగ్ డైరక్టర్, జాయింట్ కలెక్టర్ (క్రిష్ణా) జిల్లా, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గుంటూరు జిల్లా లు సభ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పోర్టల్, సినిమా టిక్కెట్ల వ్యవహరం చూస్తుందని చెప్పిన స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఉన్న మానవ వనరులు ఎన్ని..మళ్లీ పోర్టల్ డెవలప్ మెంట్ బాధ్యత ఈ సంస్థ ప్రైవేట్ కు అప్పగించకుండా సొంతంగా చేసే ఛాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి సర్కారు సినిమా టిక్కెట్ల విక్రయ వ్యవహరంపై అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.