128 కోట్ల చెల్లింపులకు ఐదారు కోట్లతో యాడ్సా?
ఏపీ సర్కారు వింత చర్యలు
మళ్ళీ ప్రచారం ఏంటో తెలియదని వ్యాఖ్యలు
బిల్లులు ఆగి గురుకులాల్లో పిల్లలకు ఆహార సరఫరా బంద్ !
ఏపీలో ఓ వైపు గురుకులాల్లో పిల్లలకు ఆహారం అందటం లేదు. దీనికి కారణం సర్కారు వీళ్లకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటమే. ఒక్క గురుకులాలే కాదు..ఏపీలో ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సిన వారెందరో. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎంతో మంది చిన్న చిన్న బిల్లులు కూడా రాకుండా విలవిలలాడిపోతున్నారు. పని చేయటం తప్ప..తమకు అసలు ప్రచారం చేసుకోవటమే తెలియదన్నట్లు మాట్లాడే సర్కారు 128.47 కోట్ల రూపాయల చెల్లింపుల కోసం ఏకంగా ఐదారు కోట్ల రూపాయల మేర ప్రకటనలకు ఖర్చు పెడుతోంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద 128.47 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఏపీ సర్కారు మంగళవారం నాడు పలు ప్రధాన పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇచ్చింది. తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ఈ యాడ్స్ దర్శనం ఇచ్చాయి. ఇంత తక్కువ మొత్తం చెల్లింపులకు కూడా కోట్లాది రూపాయల వ్యయం చేసి ఇలా ప్రభుత్వ ధనం దుబారా చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.
ప్రభుత్వం చేసే ఏ చిన్న కార్యక్రమం అయినా ఏపీ సర్కారులో మాత్రం జాకెట్ యాడ్ చాలా కామన్ అయింది. ప్రచారంలో పరాకాష్ట అనుకున్న చంద్రబాబు హయాంలో కూడా ఇలా ప్రతి దానికి జాకెట్ యాడ్స్ ఇచ్చిన సందర్భాలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తాము అసలు ప్రచారమే చేసుకోవటం లేదని..ప్రచారం అంటే ఏంటో తమకు తెలియదన్నట్లు వ్యవహరించే సర్కారు పెద్దలు ఈ యాడ్స్ రూపంలో చేసే ఖర్చు విషయాన్ని మాత్రం చాలా కన్వీనెంట్ గా మర్చిపోతున్నారు. ఇది అంతా ఒకెత్తు అయితే అధికారంలో ఉన్న పెద్దల సొంత పత్రికకే యాడ్స్ లో సింహభాగం వెళుతోంది. నెంబర్ వన్ పత్రికల కంటే కూడా సొంత పత్రికకే ఎక్కువ ధర చెల్లింపులు జరుగుతున్నాయని..కాగ్ తనిఖీల్లో మాత్రం ఈ వ్యవహారం సంబంధిత అధికారులకు చుక్కలు చూపించటం ఖాయం అని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.