నేను నొక్కుతాను..మీరు నొక్కివక్కాణించాలి
ఏ పథకం అయినా..ఓ స్కీమ్ అయినా తాడేపల్లిలోనే..లేక ఏదైనా జిల్లాలోనే కార్యక్రమం పెట్టి అంతా సీఎం జగన్ చేతుల మీదుగా నొక్కుడు కార్యక్రమం నిర్వహించారు. రాజకీయంగా ఇది తమకు నష్టం అయినా మధ్యవర్తులు లేకుండా ప్రజలకు నేరుగా సాయం అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఓ సారి స్పష్టం చేశారు కూడా. ప్రభుత్వం తరపున సాయం అందించే విషయాలను తెలుపుతూ పత్రికల్లో ఇచ్చే ఫుల్ పేజీ, జాకెట్ యాడ్స్ లోనూ ఒక్క సీఎం జగన్ తప్ప ..సంబంధిత శాఖ మంత్రుల ఫోటోలు కూడా లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రులు..మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో సామాజిక న్యాయం పాటించామని గొప్పగా చెప్పుకునే సీఎం జగన్..కనీసం వారి ఫోటోలను కూడా ప్రభుత్వ యాడ్స్ లో వేయటానికి అంగీకరించటంలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లోనే సాగుతుంది. అదే సమయంలో సీఎం పోస్టు అంటే అదేదో కేవలం బటన్ నొక్కటమే అన్న తరహాలో జగన్ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. బటన్లు నొక్కటానికి అయితే సీఎంలు ఎందుకు..ఆ పని ఏ అధికారికి అప్పగించినా చేస్తారు కదా..పాలనలో కొత్త మోడల్ చూపించాల్సిన నాయకులు..ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు పంచి ఇదే పాలన అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.