Telugu Gateway
Telugugateway Exclusives

చంద్ర‌బాబు కంపెనీతో జ‌గ‌న్ 'రియ‌ల్ వ్యాపారమా?!'

చంద్ర‌బాబు కంపెనీతో జ‌గ‌న్ రియ‌ల్ వ్యాపారమా?!
X

ఏపీని రియ‌ల్ ఎస్టేట్ కంపెనీగా మార్చిన జ‌గ‌న్

ఏకంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెంచ‌ర్ల‌కు స‌న్నాహాలు

ఇసుక అమ్మలేని ప్ర‌భుత్వం స్థ‌లాల వ్యాపారం చేస్తుందా?

సీఆర్ డీఏ అంటే వాస్త‌వ అర్ధం రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ‌. కానీ వైసీపీ నేత‌లు మాత్రం సీఆర్ డీఏ అంటే చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్ మెంట్ ఆథారిటీ అంటూ ప‌దే ప‌దే విమ‌ర్శించారు. సీఆర్ డీఏ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ అంటూ ప్ర‌చారం చేసిన అదే సీఆర్ డీఏతో జ‌గ‌న్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అంటే చంద్ర‌బాబు కంపెనీతో జ‌గ‌న్ కూడా ఇప్పుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా?. వైసీపీ ఆరోప‌ణ‌లే కాసేపు నిజం అనుకుంటే చంద్ర‌బాబు రియ‌ల్ఎస్టేట్ వ్యాపారం ఒక్క రాజ‌ధాని ప్రాంతానికి ప‌రిమితం కాగా... సీఎం జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు..సీఆర్ డీఏ ప‌రిధిలో అమ్మే స్థ‌లాల‌కు సంబంధించి ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తూ బ్రోచ‌ర్లు ముద్రించారు. ఓ వైపు ఏపీ మంత్రులు ఎవ‌రు అడ్డుప‌డినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే స‌చివాల‌యం వైజ‌గ్ కు వెళుతుంద‌ని ప్ర‌క‌టిస్తున్నారు. కానీ సీఆర్ డీఏ గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో వేసిన వెంచ‌ర్ గురించి చెబుతూ ఏపీ సెక్ర‌టేరియ‌ట్ ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని, ఏపీ హైకోర్టు 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని అంటూ ఫ‌క్తు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలా ప్ర‌స్తావించారు.

కానీ జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం విశాఖ‌ప‌ట్నానికి స‌చివాల‌యం, హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించాల‌ని ప్ర‌తిపాదించింది. మ‌రి ఇప్పుడు సీఆర్ డీఏ ఎంఐజీ జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టులో వీటిని చూపించి మార్కెట్ చేయ‌టం చీటింగ్ కింద‌కు రాదా?. రాజ‌ధాని ప్రాంతాల్లో ప్ర‌భుత్వ స్థ‌లాలు ఉంటే వాటిని ప్లాట్ల కింద విక్ర‌యించ‌టం..అపార్ట్ మెంట్స్ క‌ట్టి ఇవ్వ‌టం ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్ప‌టి నుంచి అమ‌ల్లో ఉన్న ప‌ద్ద‌తే. అయితే ప్ర‌భుత్వం ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలాగా ఏకంగా 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వెంచ‌ర్లు వేస్తామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. కీల‌క ప‌ట్ట‌ణాల్లో ప్ర‌భుత్వ భూములు ఉంటే వాటిని అమ్మ‌టం ఒకెత్తు. కానీ జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో రాష్ట్ర‌మంత‌టా రియ‌ల్ వ్యాపారానికి ఏపీ స‌ర్కారు శ్రీకారం చుట్టింది. ఓ వైపు పార‌దర్శ‌కంగా..ప్ర‌జ‌లకు అందుబాటు ధ‌ర‌లో ప్ర‌భుత్వ‌మే ఇసుక అమ్ముతామ‌ని బొక్క‌బోర్లాప‌డ్డారు. ఇసుక అమ్మ‌లేక చేతులెత్తేసిన స‌ర్కారు ఇలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు వేస్తుందా?.

ప్ర‌భుత్వం పాల‌న చేయ‌టానికా..లేక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌టానికి ఉందా?. గ‌తంలో అమ‌రావ‌తిలో రాజధాని పేరుతో చంద్ర‌బాబు చేసిన ల్యాండ్ పూలింగ్ ను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా అభివ‌ర్ణించిన వారే ఇప్పుడు రాష్ట్ర‌మంత‌టా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌టానికి సిద్ధ‌ప‌డ‌టంతో జ‌గ‌న్ మ‌రో రివ‌ర్స్ గేర్ వేసినట్లు అయింది. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా మాట్లాడేది ఒక‌టి..అధికారంలోకి వ‌చ్చాక చేసేది మ‌రొక‌టి అన్న చందంగా త‌యారైంది ప‌రిస్థితి. కార‌ణాలు ఏమైనా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక రాజ‌ధానికి బ్రేక్ లు వేయ‌టంలో ఒక్క విశాఖ‌ప‌ట్నంలో త‌ప్ప‌..చాలా చోట్ల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప‌డ‌కేసింది. ఏపీకి చెందిన ప‌లువురు వ్యాపారులు కూడా హైద‌రాబాద్ వైపు ఫోక‌స్ పెట్టారు. ఇప్పుడు స‌ర్కారే ఏకంగా జ‌గ‌న‌న్న పేరుతో రియ‌ల్ ఎస్టేట్ దందా ప్రారంభించింది.

Next Story
Share it