జగన్ కొత్త వ్యూహకర్తను వెతుక్కోవాలా?!
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఈ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధం కావటంతో రాజకీయ పరిణామాలు చకచకా సాగుతున్నాయి. పార్టీలో చేరికకు కాంగ్రెస్ అధిష్టానం పలు షరతులు పెడుతున్నట్లు సమాచారం. అందులో ముఖ్యమైనది ప్రశాంత్ కిషోర్ ఏపీలో వైసీపీ అధినేత జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కెసీఆర్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో రాజకీయ సంబంధాలు తెంచుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు ప్రశాంత్ కిషోర్ ఓకే అంటే సీఎం జగన్ కొత్త వ్యూహకర్తను వెతుక్కోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ కు సేవలు అందిస్తుంది గత కొంత కాలం నుంచే. మరో విశేషం ఏమిటంటే కాంగ్రెస్ షరతు పెట్టిన మూడు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నవే కావటం విశేషం. కాంగ్రెస్ లో చేరితే పూర్తి కాలం పార్టీకే పనిచేయాలి కానీ..ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకోవటం సరికాదని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కమిటీ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రశాంత్ కిషోర్ ఇందుకు అంగీకరిస్తారా? లేక తనతో సంబంధం లేకుండా తన సంస్థ ఐప్యాక్ మాత్రమే వారికి సేవలు అందిస్తుందని చెబుతారా అన్నది వేచిచూడాల్సిందే. కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన షరతులకు ప్రశాంత్ కిషోర్ ఓకే చెపితే మాత్రం జగన్, కెసీఆర్ లు ఇద్దరూ కొత్త వ్యూహకర్తలను వెతుక్కోవాల్సి ఉంటుంది.
2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఓ బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేస్తూ తొలిసారి మోడీని గెలిపించింది ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకు సేవలు అందించటానికి వచ్చారంటూ ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు జగన్ పాదయాత్రతోపాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు..సర్వేలు చాలా వరకూ పనిచేశాయనే విషయం తెలిసిందే. సమగ్ర సర్వేలు చేసి..ఏ నియోజకవర్గంలో ఎవరు అయితే గెలుస్తారు అన్న నివేదికలు ఇచ్చి అప్పట్లో వైసీపీని ఆయన విజయతీరాలకు చేర్చారు. షెడ్యూల్ ప్రకారం అయితే మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ కాంట్రాక్ట్ కు గుడ్ బై చెబుతారా? . అలా జరిగితే మరి జగన్ మరో వ్యూహకర్తను తెచ్చుకుంటారా? లేక తన పథకాలే తనను గెలిపిస్తాయని దీమాతో జగన్ ముందుకెళతారా అన్నది వేచిచూడాల్సిందే.