Telugu Gateway
Telugugateway Exclusives

జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రుల‌కు జూన్ వ‌ర‌కూ పొడిగింపు?!

జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రుల‌కు జూన్ వ‌ర‌కూ పొడిగింపు?!
X

కాలం అంతా క‌రోనాతోనే పోయింది..జూన్ వ‌ర‌కూ అవ‌కాశం ఇవ్వండి

కొంత మంది మంత్రుల విన‌తి!

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఉత్కంఠ‌!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంత్రులుగా రెండున్న‌ర సంవ‌త్స‌రాలు కొంత మంది..మిగిలిన రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మ‌రికొంత‌కి ఛాన్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. తొలి ద‌ఫాలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన వారి గ‌డువు న‌వంబ‌ర్ తో ముగియ‌నుంది. దీంతో దిగిపోవాల్సిన మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొన‌గా...కొత్త‌గా ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుందో అన్న ఉత్కంఠ ఆశావ‌హుల్లో ఉంది. గ‌త కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ఊహ‌గానాలు..ర‌క‌ర‌కాల పేర్లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేంటి అంటే తొలి ద‌ఫాలో మంత్రివ‌ర్గంలో ఛాన్స్ ద‌క్కించుకున్న వారిలో కొంత మంది త‌మ కాలం అంతా క‌రోనాతోనే గ‌డిచిపోయింద‌ని..త‌మ‌కు వ‌చ్చే జూన్ వ‌ర‌కూ అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ కు క‌ల‌సి రిక్వెస్ట్ పెట్టిన‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాలు తెలిపాయి. కొంత మంది సీనియ‌ర్ మంత్రులే ఇలాంంటి ప్ర‌తిపాద‌న తెర‌పైకి తెచ్చార‌ని చెబుతున్నారు. గ‌త ఏడాది మార్చిలోతెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయిన క‌రోనా ఇప్ప‌టికీ ఇంకా ఇబ్బందిపెడుతూనే ఉంది. క‌రోనా కార‌ణంగా తాము ఏడాదిన్న‌ర స‌మ‌యాన్ని కోల్పోయామ‌ని..అందుకే త‌మ‌కు క‌నీసం జూన్ వ‌ర‌కూ అయినా ఛాన్స్ ఇవ్వ‌మ‌ని కోరుతున్నారు.

వాస్త‌వంగా అయితే ఈ డిమాండ్ లో కొంత స‌హేతుక‌త కూడా ఉంద‌నే చెప్పొచ్చు. మ‌రి ఈ ప్ర‌తిపాద‌న‌ను సీఎం జ‌గ‌న్ ఆమోదిస్తారా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే. వీరు త‌మ వాద‌న‌కు మ‌రో అంశాన్ని కూడా తెర‌పైకి తెస్తున్నారు. జూన్ వ‌ర‌కూ త‌మ‌కు గ‌డువు ఇస్తే అప్ప‌టిలోగా మూడు రాజ‌ధానుల‌కు సంబంధించిన అంశంపై న్యాయ‌స్థానంలో కూడా స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని...నూత‌న విద్యా సంవ‌త్స‌రం నుంచి విశాఖ‌కు ప‌రిపాల‌నా రాజ‌ధాని త‌ర‌లిస్తే స‌రిపోతుంద‌నే వాద‌న కూడా తెచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అప్పుడైతే కొత్త రాజ‌ధాని..కొత్త మంత్రులు ఉంటార‌ని అంటున్నారు. అయితే జ‌గ‌న్ ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ, మార్పు చేర్పులకు సంబంధించిన క‌స‌రత్తు చాలా వ‌ర‌కూ పూర్తి చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి మంత్రివ‌ర్గంలో అంద‌రినీ తీసేసి..వారి స్థానంలో కొత్త వారికి చోటు ఇస్తార‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. క‌రోనా న‌ష్టం అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జ‌గ‌న్ ప్ర‌స్తుత మంత్రుల‌కు జూన్ వ‌ర‌కూ గ‌డువు ఇస్తే ఆశావ‌హులు మ‌రికొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి తుది నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it