Telugu Gateway
Telugugateway Exclusives

అప్పుడు ముఖ్యమంత్రే సీఈఓ ..ఇప్పుడు సీఎం కు సీఈఓ

అప్పుడు ముఖ్యమంత్రే సీఈఓ ..ఇప్పుడు సీఎం కు సీఈఓ
X

సమీర్ శర్మపై జగన్ కు అంత ప్రత్యేక ప్రేమ ఎందుకో?

ఐఏఎస్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ

అసలు ఏంటీ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ప్రత్యేకత. చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో అయన కూడా ఒకరు. అంతే తప్ప పాత తరం ఐఏఎస్ లకు ఉన్నట్లు ఆయనకు ప్రత్యేకమైన ముద్ర కూడా ఏమీలేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన రెడ్డికి మాత్రం సమీర్ శర్మ లో ఏమి ప్రత్యేకతలు కనిపించాయో తెలియదు కానీ ఆయన్ను మాత్రం సీఎం చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నారు అనే చర్చ ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ వర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యాక ఆయనకు వచ్చిన పొడిగింపు కూడా అసాధారణంగానే ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి. సీ ఎస్ గా పదవి విరమణ చేయనున్న సమీర్ శర్మకు ఎవరికీ దక్కని రీతిలో డబల్ ధమాకా రావటం మరో సారి ఈ అంశం చర్చనీయాంశగా మారింది. అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ..రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వంలో..అది ముఖ్యమంత్రి దగ్గర తొలిసారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సృష్టించారు. . ఆఫీసర్ అని అందులో లేదు కానీ అయన ఐఏఎస్ అధికారి కావటంతో ..ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం ఆఫీసులో అయన సీఈఓ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎక్స్ ఆఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో అయన పనిచేస్తారని జీఓ లో పేర్కొన్నారు.

ఇక్కడితోనే ఆగలేదు. సమీర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా కూడా వ్యవహరించనున్నారు. మాములుగా పదవి విరమణ చేసిన వారికి ఒక పోస్ట్ ఇవ్వటమే ఉపాధి హామీ పథకం కింద లెక్క. అలాంటిది సమీర్ శర్మ కు ఏకంగా రెండు పోస్ట్లు ఇవ్వటం చూసి అధికారులు అవాక్కు అవుతున్నారు. అయితే సమీర్ శర్మ పై జగన్ ఇంత ప్రత్యేక ప్రేమ చూపించటం వెనక బలమైన కారణాలు ఉన్నాయని అటు రాజకీయ ..ఇటు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇవి బయటకు కనిపించేవి కావని చెపుతున్నారు. తాజా పరిణామాలపై అధికారుల్లో ఆసక్తి కరమైన చర్చ నడుస్తోంది. తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో సీఈఓ గా పిలిపించుకోవటానికి ఇష్టపడేవారు. జాతీయమీడియాలో కొన్నిసార్లు అలాగే రాసేవారు కూడా . దీనికి ప్రధాన కారణం అయన అప్పట్లో పారిశ్రామికవేత్తలతో చాలా ఫ్రెండ్లీగా ఉండటమే. పాలనా కూడా అదే తరహాలో సాగేది. మాజీ సీఎం సీఈఓ ల పాలనా సాగిస్తే..ప్రస్తుత సీఎం తన కోసం ఒక సీఈఓ ను పెట్టుకున్నారని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it