జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు!
వ్యాక్సినేషన్ పైనా సర్కారు ప్రత్యేక ఫోకస్
ఆర్డినెన్స్ తో తాత్కాలిక బడ్జెట్ కు ఆమోదం
ఏపీ సర్కారు ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ ఆమోదింపచేసుకోనుంది. అందుకే ఇప్పటివరకూ సమావేశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసుకోవాలని సర్కారు తలచింది. కానీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు క్లియరెన్స్ తర్వాత కూడా ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన ఆగిపోయిన దగ్గర నుంచి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరని స్పష్టం అయిపోయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం పూర్తికాగానే కొత్త ఎస్ఈసీని నియమించి..పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసేయాలని సర్కారు యోచిస్తోంది. వేడిలోవేడిగా ఈ ఎన్నికలు కూడా పూర్తి అయిపోతే అసెంబ్లీ ఎన్నికలు తప్ప..మధ్యలో మరో ఎన్నికలు ఉండవు. అందుకే సర్కారు వీటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
దీంతోపాటు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినందున ఏపీలోనూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మే నాటికి ఎన్నికలు, వ్యాక్సినేషన్ ను ఓ కొలిక్కి తెచ్చి అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి..పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓ మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ఆమోదించుకునే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభిస్తే మార్చి 31 తర్వాత కూడా ప్రభుత్వం ఖజానా నుంచి నిధుల వాడకానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయం తెలిసిందే.