ఇది నమ్మితే...అదీ నమ్మాల్సిందే
వాస్తవానికి ఈ రెండూ వేర్వేరు వార్తలు. అయితే ఈ విషయాలు చెప్పింది మాత్రం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్. మళ్లీ కెసీఆరే స్వయంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సర్వే చేసి పక్కా నివేదికలు ఇస్తారని తెలిపారు. నిజానికి ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేయటానికే లక్షలాది రూపాయల వ్యయం అవుతుంది. అదే పార్లమెంటరీ నియోజకవర్గం అయితే ఆ లెక్కే వేరు. ఈ సర్వే వ్యయం కూడా తీసుకునే శాంపిల్ ను బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ మంది అభిప్రాయం తీసుకుంటే ఖర్చు అంతే భారీ స్థాయిలో మారుతుంది. అలాంటిది సీఎం కెసీఆర్ చెప్పినట్లు ప్రశాంత్ కిషోర్ ఓ కంపెనీ పెట్టుకుని కోట్లాది రూపాయల వ్యయంతో కెసీఆర్ కోసం ఫ్రీగా సర్వేలు చేసిపెడతారా?.
ఈ సర్వేలు చేసే టీమ్ కు వేతనాలు కూడా స్వయంగా పీకెను అప్పులు చేసి చెల్లిస్తారా?. పని కెసీఆర్ కోసం..పేమెంట్ కూడా పీకెనే చేసుకుంటారు అంటే నమ్మశక్యమైన వ్యవహారమేనా?. దీనికి కొనసాగింపుగానే అసలు ఈ సారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లం గాక వెళ్ళం అంటూ కెసీఆర్ తేల్చిచెప్పారు. పీకె ఫ్రీగా పనిచేసి పెడతారనటంలో ఎంత నిజం ఉందో..ముందస్తు ఎన్నికల విషయంలో కెసీఆర్ చెప్పిన మాటలను మరో కోణంలో చూడాలేమో అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.